
డీఎంకే బలోపేతానికి సమష్టిగా పనిచేయాలి
వేలూరు: డీఎంకే బలోపేతానికి కార్యకర్తలందరూ కలసికట్టుగా పనిచేయాలని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అన్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పలు కార్యక్రమాల్లో కలుసుకునేందుకు మంగళవారం సాయంత్రం వేలూరుకు వచ్చారు. ఆయనకు కలెక్టర్ సుబ్బలక్ష్మి పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా ఆయనకు డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శి నందకుమార్ అధ్యక్షతన కార్యకర్తలు జిల్లా సరిహద్దు ప్రాంతమైన పిల్లయార్‌కుప్పం గ్రామం వద్ద ఘన స్వాగతం పలికారు. ఉదయం వేలూరు జిల్లా కాట్పాడిలోని తూర్పు డివిజన్ కార్యదర్శి వన్నియరాజ, కార్పొరేషన్ మొదటి జోన్ చైర్మన్ పుష్పలత దంపతుల కుమార్తె వివాహ వేడకల్లో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు మంత్రులు దురై మురుగన్, ఆర్ గాంధీ, పార్లమెంట్ సభ్యులు జగత్‌రక్షగన్, కదీర్ ఆనంద్, ఎమ్మెల్యేలు నందకుమార్, కార్తికేయన్, అములు, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం వేలూరులోని ప్రైవేటు కల్యాణ మండపంలో ఉదయనిధి యువజన విభాగం కార్యకర్తలతో సమీక్షించి, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కంకణం కట్టుకోవాలని తెలిపారు.