
చిన్నారులకు చిత్రహింస
తిరువళ్లూరు: చెప్పిన మాట వినడం లేదని ఇద్దరు చిన్నారులను చిత్రహింసలకు గురిచేసిన తల్లి, ఆమె రెండో భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి వద్ద చేపట్టిన సబ్‌వే డ్రైనేజీ పనులు చేస్తున్న కూలీల కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారుల చేతికి గాయమై కనిపించారు. ఈ సంఘటననూ చూసి షాక్‌కు గురైన కొందరు పోలీసులకు రహస్య సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు, చిన్నపిల్లల సంరక్షణ అధికారులు గాయపడిన చిన్నారులను చూసి చలించిపోయారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైదశాలకు తరలించారు. అనంతరం పోలీసులు చేపట్టిన విచారణలో కల్లకురుచ్చి ప్రాంతానికి చెందిన సత్య(23)కు అదే ప్రాంతానికి చెందిన శివతో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. భర్తతో వివాదాల కారణంగా శివతో విడిపోయి, అన్బరసన్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. పిల్లలు చెప్పిన మాట వినడం లేదన్న అక్కసుతో వారిని చిత్ర హింసలకు గురి చేయంతో చిన్నారులు గాయపడినట్టు పోలీసులు నిర్ధారించారు. దీంతో సత్య, అన్బరసన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.