
శ్రీగోవిందుని పుష్పయాగానికి అంకురార్పణ
తిరుపతి కల్చరల్: శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఈనెల 2న బుధవారం జరుగనున్న స్వామి వారి పుష్పయాగానికి మంగళవారం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల మధ్య సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. శ్రీవిష్వక్సేనులవారు ఆలయ మాడ వీధుల్లో విహరించిన తర్వాత అర్చక పండితులు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. కాగా బుధవారం ఉదయం 9.30 గంటలకు సతీసమేత శ్రీగోవిందరాజస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం,చేపట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలు రకాల పుష్పాలు, పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి వారికి అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఏఈవో మునికృష్ణారెడ్డి, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.