
విద్యార్థులకు క్రమశిక్షణ అవసరం
వేలూరు: విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ ఎంతో అవసరమని భగవాన్ మహావీర్ దయానికేతన్ జైన్ పాఠశాల చైర్మన్ దిలీప్‌కుమార్‌జైన్ అన్నారు. కాట్పాడిలోనీ బీఎమ్‌డీ జైన్ పాఠశాల తొలిసారి పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు స్వాగతం పలికే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమంలు నిర్వహించి, విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేసి, ప్రసంగించారు. పాఠశాల విద్యలోనే విద్యార్థులకు క్రమశిక్షణను అలవాటు చేయాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యంతోపాటు తల్లిదండ్రులపై ఆధారపడి ఉందన్నారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదివేలా అలవాటు చేయాలే తప్ప, కఠినంగా శిక్షించి, ప్రతి నిమషం చదువుపైనే ధ్యాస పెట్టేలా చేయకూడదన్నారు. పాఠశాలతోపాటు ఇంటి వద్ద కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వారు ఎటువంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రమశిక్షణ గల విద్యార్థులుగా ఎదుగుతారన్నారు. విద్యార్థులు వారి జీవితాలను ఆరోగ్యంగా ఉండేలా చూడాలన్నారు. ఇందుకు ప్రతిరోజూ యోగా చేయడం అవసరమన్నారు. పట్టుదల, క్రమశిక్షణ చిన్న వయస్సు నుంచే ప్రతి ఒక్కరికీ అవసరమని, అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరన్నారు. ఇటీవల కాలంలో సెల్‌ఫోన్లకు చిన్నా పెద్దా తేడా లేకుండా బానిస అవుతున్నారని, ఆ వ్యసనం నుంచి బయటకు వచ్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ మాలతి, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.