
అలాంటి పనులు వేదన కలిగిస్తాయి..!
తమిళసినిమా: నటుడు సూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మామన్. నటి ఐశ్వర్య లక్ష్మి నాయకిగా నటించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. మేనమామ, మేనల్లుడు అనుబంధం ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. ఇదిలా ఉంటే మామన్ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ సూరి అభిమానులు దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేయిస్తున్నారు. అలా తిరుప్పాంగుడ్రంలో కుమారస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన సూరి అభిమానులు కొందరు మామన్ చిత్రం విజయం సాధించాలని మొక్కుకుని నేలపై భోజనం చేశారు. ఈ విషయం తెలిసిన సూరి అభిమానులపై ఫైర్ అయ్యారు. కథ, కథనం బాగుంటే చిత్రం హిట్ అవుతుందన్నారు. అంతే కానీ నేలపై భోజనం చేయడం పనికిమాలిన చర్య అని, ఇది వేదన కలిగిస్తోందని అన్నారు. ఆ డబ్బుతో నలుగురికి భోజనం పెట్టించవచ్చని, నీళ్లు, మజ్జిగ వంటివి ఇచ్చి దాహం తీర్చవచ్చని అన్నారు. అలాంటి వాళ్లకు తన అభిమానులని చెప్పుకునే అర్హతే లేదని పేర్కొన్నారు. సూరి అభిప్రాయాన్ని ప్రముఖ గీత రచయిత వైరముత్తు ప్రశంసించారు. అభిమానుల అనైతిక చర్యలను ప్రతి నటుడు ఖండించాలని, తమ అభిమానులకు హిత వ్యాఖ్యలు చేయాలన్నారు. అప్పుడే సంస్కృతి సంప్రదాయాలు ఇంకా మెరుగు పడతారనే అభిప్రాయాన్ని వైరముత్తు వ్యక్తం చేశారు.