17 అక్రమ కట్టడాల కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

17 అక్రమ కట్టడాల కూల్చివేత

May 17 2025 6:31 AM | Updated on May 17 2025 6:31 AM

17 అక్రమ కట్టడాల కూల్చివేత

17 అక్రమ కట్టడాల కూల్చివేత

తిరువొత్తియూరు: చైన్నె గిండి రేస్‌ కోర్స్‌ రోడ్డులో 17 అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. వివరాల్లోకి వెళితే.. చైన్నె గిండి రేస్‌ కోర్స్‌ రోడ్డులో భవాని అమ్మన్‌ ఆలయానికి చెందిన స్థలంలో 7 దుకాణాలు, అక్కడున్న ప్రభుత్వ భూములు ఆక్రమించి 10 దుకాణాలు ఆక్రమంగా నిర్మించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఈ ఆక్రమణ కట్టడాలను కూల్చి వేయడానికి చైన్నె జిల్లా కలెక్టర్‌ రష్మీ సిద్ధార్థ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చైన్నె గిండి రేస్‌ కోర్స్‌ రోడ్డులో ఉన్న ఆలయ స్థలంలో ఆక్రమంగా నిర్మించిన 7 దుకాణాలు, ప్రభుత్వ స్థలంలో నిర్మించిన 10 కట్టడాలను శుక్రవారం గిండి తసీల్దార్‌ మణిమేఘలై నేతృత్వంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కూల్చివేశారు. గిండీ పోలీసులు ఇన్‌స్పెక్టర్‌ ప్రభు నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

హజ్‌ యాత్ర

సాక్షి, చైన్నె: తమిళనాడు నుంచి హజ్‌ యాత్ర శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. బక్రీద్‌ పండుగ సందర్భంగా ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో జరిగే ప్రార్థనల నిమిత్తం హజ్‌ యాత్రకు రాష్ట్రం నుంచి అర్హులైన వారిని హజ్‌ కమిటీ ద్వారా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరిలో తొలి బృందం బయలు దేరి వెళ్లింది. వీరికి మంత్రి నాజర్‌ తదితరులు విమానాశ్రయంలో ఆహ్వానం పలికి హజ్‌ యాత్రకు పంపించారు.

లైంగిక వేధింపుల కేసులో ఇద్దరికి జైలు

అన్నానగర్‌: పదో తరగతి విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రైవేట్‌ స్కూలు ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే.. కరూర్‌ జిల్లాలోని సెంగల్‌ సమీపంలోని పాపిరెడ్డి పట్టిలోని ఒక ప్రైవేట్‌ పాఠశాలలో తమిళ ఉపాధ్యాయుడు నీలవోలి (42), ఆ పాఠశాల ప్రిన్సిపల్‌ యువరాజ్‌ (41) ఒక విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్నారు. విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై కరూర్‌ అదనపు మహిళా కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ పూర్తయి శుక్రవారం తీర్పు వెలువడింది. పోక్సో కేసులో ఒక సెక్షన్‌ కింద తమిళ ఉపాధ్యాయుడి 20 ఏళ్లు, మరో సెక్షన్‌ కింద 20 ఏళ్లు, మరో సెక్షన్‌ కింద 3 ఏళ్లు జైలుశిక్ష, ఈ శిక్షలను అతను ఏకకాలంలో (20 సంవత్సరాలు మాత్రమే) అనుభవించాలని, ప్రిన్సిపల్‌ యువరాజ్‌కు కూడా 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించి న్యాయమూర్తి తంగవేల్‌ తన తీర్పులో పేర్కొన్నారు. న్యాయమూర్తి బాధిత బాలికకు రూ.7 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని తెలిపారు.

ప్రభుత్వ వైద్యుడికి నోటీసులు

తిరువొత్తియూరు: తూత్తుకుడి ప్రభుత్వాస్పత్రిలో మద్యం మత్తులో చికిత్స అందించిన సంఘటనలో వివరణ కోరుతూ వైద్యుడికి నోటీసులు జారీ చేశారు. తూత్తుకుడి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలోని పురుషుల ఔట్‌ పేషెంట్‌ విభాగంలో శుక్రవారం ఎక్కువ మంది రోగులు చికిత్స పొందడానికి వేచి ఉన్నారు. ఆ సమయంలో జనరల్‌ మెడికల్‌ విభాగానికి చెందిన ఒక వైద్యుడు అక్కడ ఉన్నాడు. అతను మద్యం మత్తులో ఉన్నట్టు తెలిసింది. అతను ఔట్‌ పేషెంట్‌ విభాగానికి వెళ్లి దాదాపు గంటన్నర పాటు రోగులకు చికిత్స చేశారు. ఆ సమయంలో తామాల్‌పురం నుంచి వచ్చిన మహిళ తన పక్కింటికి చెందిన వృద్ధుడికి చికిత్స చేయించడానికి వేచి ఉన్నారు. ఆ సమయంలో ఆ డాక్టర్‌ తాగి మత్తులో ఉండడాన్ని ఆమె తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. తరువాత ఆమె ఆస్పత్రిలోని ఇతర వైద్యులకు ఫిర్యాదు చేశారు. ఆ మహిళ తీసిన వీడియో కొద్దిసేపటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వైద్యులకు సమాచారం అందించడంతో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, విధుల్లో ఉన్న వైద్యుడిని తొలగించి, మరొక వైద్యుడిని నియమించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరణ కోరుతూ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రి యాజమాన్యం సంబంధిత వైద్యుడికి నోటీసులు జారీ చేసింది. ఆస్పత్రి అధికారులు కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement