
తంజావూరులో గురు పూజా మహోత్సవం
కొరుక్కుపేట: తిరుజ్ఞాన సంబంధర్ గురుపూజ సందర్భంగా తంజావూరులోని వీధిలో మురుగన్, వినాయక స్వామివార్లు విహరించారు. వేలాదిమంది భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శనం చేసుకుని తరించారు. వేదాలను వ్యాప్తి చేయడానికి, తమిళ సాంప్రదాయ, తమిళ సంగీత అభివృద్ధికి, శైవమతం విజయాన్ని ప్రోత్సహించడానికి తిరుజ్ఞాన సంబంధర్ విశేషంగా కృషి చేశారు. తమిళ సంగీత పాటలకు గొప్ప ప్రాచుర్యాన్ని సంపాదించి పెట్టారు శైవమతాన్ని స్థాపించిన నలుగురిలో ఒకరైన తిరుజ్ఞానసంబందర్ మూర్తి స్వామికి ప్రతి సంవత్సరం వైకాసి మాసంలో తంజావూరులో గురుపూజ నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా తంజావూరు రాటేరులోని పళని స్వామి ఆలయంలో వినాయకుడు, తంజావూరు జిల్లా జ్యోతి వినాయగర్ ఆలయంలో వినాయగర్, మురుగన్, కురిచ్చి వీధిలో మురుగన్, మేళాళంగం సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మురుగన్ సహా 15 ఆలయాల నుండి వినాయకులు, మురుగన్ స్వాములను ఆయా వీధుల్లో ఊరేగించారు. ఈ పల్లకీలన్నీ ఆయా ఆలయాల నుంచి ప్రారంభమై తంజావూరు కీళవీధి, మేళావీధి, దక్షిణ వీధి, ఉత్తరవీధి మీదుగా సాగాయి. ఇందులో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు.
ఘనంగా వరదరాజ
పెరుమాళ్ రథోత్సవం
కాంచీపురం(పళ్లిపట్టు): కాంచీపురంలో ప్రసిద్ధి చెందిన వరదరాజ పెరుమాళ్ రథోత్సవం ఆదివారం భక్తజనంతో కిటకిటలాడింది. వివరాలు..ఆధ్యాత్మిక పట్టణం కాంచీపురంలో పురాతన చరిత్ర కలిగిన వరదరాజ పెరుమాళ్ ఆలయంలో వైఖాసి మాసం బ్రహ్మోత్సవాలు ఈనెల 20న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. 22న గరుడసేవ నిర్వహించారు. ఆదివారం రథోత్సవం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వరదరాజ పెరుమాళ్ ప్రత్యేక అలంకరణలో ఆలయం నుంచి రథంలో కొలువుదీరారు. స్వామివారి రథోత్సవాన్ని తిలకించి స్వామి దర్శనం కోసం కాంచీపురం వీధుల్లో వేలాదిగా భక్తులు గుమిగూడారు. కర్పూర హారతులిచ్చి గోవింద నామస్మరణతో స్వామిని దర్శించుకున్నారు. రథోత్సవంలో మంత్రి దామో అన్బరసు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
వీధుల్లో విహరించిన 15 ఆలయాల మురుగన్, వినాయక ఉత్సవమూర్తులు
వేలలాదిగా తరలివచ్చిన భక్తులు

తంజావూరులో గురు పూజా మహోత్సవం