
బాధితులకు భరోసా కల్పించాలి
సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్‌లకు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్, ఫిర్యాదుల నిర్వహణ సిబ్బందికి, పోలీస్ స్టేషన్ సెక్షన్ ఇన్‌చార్జిలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. సమాజంలో పోలీస్ యూనిఫాంకు ప్రత్యేకత ఉందని, సిబ్బంది క్రమశిక్షణతో ఉండి ప్రజలు, పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులను గౌరవిస్తూ గర్వంగా పని చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా పని చేస్తే సమాజంలో పోలీస్ శాఖపై నమ్మకం పెరుగుతుందన్నారు. ఆ దిశగా సిబ్బంది టీం వర్క్ చేయాలన్నారు. పోలీస్ విధుల్లో అత్యంత ప్రధానమైంది పోలీస్ స్టేషన్ రిసెప్షన్ విధులు, ఫిర్యాదుల నిర్వహణ అని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా విధిధర్మంతో వారికి కావాల్సిన సహాయాన్ని అందించాలని, వారితో మర్యాదగా మెలగాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో నమోదు చేసి రశీదు ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలు పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీసీఆర్‌బీ హరిబాబు, ఐటీకోర్ ఆర్‌ఎస్‌ఐ రాజశేఖర్, రిసెప్షన్ పని విభాగం కో ఆర్డినేటర్ మహిశ్వర్, టెక్నికల్ టీం, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ నరసింహ