
బాలల భవితకు బాటలు
బాలకార్మికులను పనిలో
పెట్టుకుంటే కేసులు తప్పవు
మెకానిక్ షాపులు, దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలు, ఇటుక బట్టీల వద్ద బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా బాల కార్మికులను గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నాం. పట్టుబడిన బాలలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడంతోపాటు తిరిగి పనిలో పెట్టుకోకుండా అవగాహన కల్పిస్తాం. 18ఏళ్లలోపు చిన్నారులను పనుల్లో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేయిస్తాం.
– రవికుమార్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి, సూర్యాపేట
నాగారం : బందీగా మారిన బాల్యాన్ని స్వేచ్ఛ వైపు నడిపిస్తూ, చిన్నారుల మోములో చిరునవ్వే లక్ష్యంగా ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంది. దీనిలో భాగంగా బాల కార్మిక వ్యవస్థను అరికట్టేందుకు, చిన్నారులను బడిబాట పట్టించేందుకు ఏటా జనవరి –1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలై–1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్‌ను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రాథమిక విద్య బాల్యానికి పునాది. అది బలంగా ఉంటేనే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చు. కొందరు తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా బలపం పట్టాల్సిన చిన్నారులతో పనులు చేయిస్తున్నారు. పనుల నుంచి బాలలకు విముక్తి కల్పించేలా ఏటా ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్ పేరుతో ప్రత్యేక తనిఖీలు చేపడుతోంది. దీనిలో భాగంగా జిల్లాలో ఈనెల1 నుంచి ఆపరేషన్ ముస్కాన్‌ను ప్రారంభించారు.
ప్రత్యేక బృందాలు
మహిళా, శిశు సంక్షేమ శాఖ (బాలల పరిరక్షణ విభాగం) (డీసీసీయూ), పోలీసు, కార్మిక, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉద్యోగులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. బడి మానేసి పనులు చేస్తున్న చిన్నారులను ఈ ప్రత్యేక బృందాలు గుర్తించనున్నాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, హోటళ్లు, దుకాణాలు, ఆటోమొబైళ్లు, మెకానిక్ షెడ్లు, కర్మాగారాలు, ఇటుక బట్టీలు, వ్యవసాయ క్షేత్రాల్లో, ప్రమాదకరమైన పని ప్రదేశాల్లో పనులు చేస్తున్న బాలలను గుర్తిస్తారు. వారిని రక్షించడంతో పాటు పనిలో పెట్టుకున్న యాజమాన్యంపై చర్యలు తీసుకుంటారు. బాలల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తారు. వారు బడిబాట పట్టేలా చర్యలు చేపడతారు. తల్లిదండ్రులు లేని పిల్లలు తారసపడితే ప్రభుత్వ వసతి గృహాల్లో చేర్పిస్తారు. గుర్తించిన వారిలో 14 ఏళ్లలోపు పిల్లలు బాల కార్మికులుగా పనులు చేస్తుంటే బాధ్యులపై కార్మిక శాఖ బాండెడ్ లేబర్ చట్టం, 15–18 ఏళ్ల లోపువారు ఉంటే ప్రొబేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ చట్టం ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేస్తారు. గుర్తించిన పిల్లల వయస్సు ఆధారంగా వారి భవితకు దిశా నిర్దేశం చేస్తూ తగిన చర్యలు తీసుకుంటారు.
ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే..
ఏటా ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ పేరిట గుర్తించిన బాలల తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వడంతోనే సరిపెడుతున్నారు. తర్వాత వారు బడికి వెళ్తున్నారా, లేదా అని సమీక్షించడం లేదు. ప్రత్యేక తనిఖీలతో సరిపెట్టకుండా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తేనే ఉత్తమ ఫలితాలు ఉంటాయి.
ఫ కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్
ఫ మహిళా, శిశు సంక్షేమ శాఖ,
పోలీసు, కార్మిక శాఖ
ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు
ఫ 31వ తేదీ వరకు
బాల కార్మికుల గుర్తింపు
ఫ బందీ నుంచి స్వేచ్ఛ వైపు
నడిపించేలా ప్రణాళిక
తనిఖీల్లో గుర్తించిన పిల్లల వివరాలు
సంవత్సరం ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ముస్కాన్
2021 76 78
2022 79 142
2023 85 118
2024 120 140
2025 144 ప్రస్తుతం
కొనసాగుతోంది

బాలల భవితకు బాటలు