
అనర్హులకు పింఛన్లు కట్!
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో అనర్హులకు అందుతున్న పింఛన్లపై ప్రభుత్వం సోషల్ ఆడిట్ నిర్వహించనుంది. ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ సోషల్ ఆడిట్‌తో పెద్దఎత్తున అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. ఇదేవిధంగా పింఛన్లపైనా సోషల్ ఆడిట్ నిర్వహిస్తే అనర్హులకు అందకుండా చూడొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో ఏ కేటగిరి పింఛన్లు ఎన్ని ఉన్నాయి..? ఇందులో ఇంకా చనిపోయిన వారి పేరున పింఛన్లు అందుతున్నాయా..? లేదా అనే వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది.
భారీగా దరఖాస్తులు..!
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ప్రజా పాలనలో దరఖాస్తులు స్వీకరించగా దాదాపు 84 వేల దరఖాస్తులు పింఛన్ల కోసం వచ్చాయి. ఇందులో దివ్యాంగుల పింఛన్ల దరఖాస్తులే 10,623 ఉన్నాయి. ఇతర పింఛన్ దరఖాస్తులు మరో 74,465 ఉన్నాయి. ఈ దరఖాస్తులకు మోక్షం లభించాలంటే పాత వాటిలో అనర్హులకు అందుతున్న పింఛన్లు తొలగించాల్సి ఉంది.
జిల్లాలో 1,45,682 పింఛన్లు
జిల్లా వ్యాప్తంగా 1,45,682 మందికి వివిధ రకాల పింఛన్లు అందుతున్నాయి. ఇందులో అత్యధికంగా వృద్ధాప్య పింఛన్లు 53,205 ఉండగా తర్వాత వితంతు పింఛన్లు ఉన్నాయి. అయితే గత బీఆర్‌ఎస్ పాలనలో ఎలాంటి అర్హత లేకున్నా వివిధ రకాల పింఛన్లు ఆ పార్టీ కార్యకర్తలకు అందించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా వయస్సు లేకున్నా ఆధార్ కార్డుల్లో మార్పులు చేసుకుని ఈ పింఛన్లు పొందినట్లు ప్రభుత్వం భావిస్తోంది. అలాగే వికలాంగుల పింఛన్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటికీ చెక్ పడాలంటే సోషల్ ఆడిట్ జరగాల్సిందేనని ప్రభుత్వం భావిస్తుండగా.. ఏ విధంగా ఈ ఆడిట్ నిర్వహిస్తే బాగుంటుందన్న వివరాలను క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వం సేకరిస్తోంది. ముందుగా పింఛన్ల పంపిణీ పకడ్బందీగా జరగడంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. కొన్నిచోట్ల మృతిచెందిన వారి పేరున నాలుగైదు నెలల పాటు పింఛన్లు మంజూరు కాగా.. వీటిని అక్రమంగా పంచాయతీ కార్యదర్శి, పోస్టల్ సిబ్బంది కలిసి పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇలా మృతిచెందిన వారి పేర్లను వెంటనే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎలాంటి ఆదేశాలు రాలేదు
సోషల్ ఆడిట్‌పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. వస్తే తప్పకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు అమలు చేస్తాం. జిల్లాలో పింఛన్ల పంపిణీని పకడ్బందీగా చేపడుతున్నాం.
– అప్పారావు, డీఆర్‌డీఓ
ఫ ఆసరా పింఛన్లపై సోషల్ ఆడిట్
నిర్వహించనున్న ప్రభుత్వం
ఫ ప్రక్రియ అమలుపై క్షేత్రస్థాయిలో
వివరాలు సేకరిస్తున్న అధికార
యంత్రాంగం
ఫ మొదటగా మృతిచెందిన వారి
పేర్ల తొలగింపుపై దృష్టి
జిల్లాలో పింఛన్లు ఇలా..
వృద్ధులు : 53,205
దివ్యాంగులు : 18,458
వితంతువులు : 56,277
ఒంటరి మహిళలు : 6795
చేనేత : 873
కల్లుగీత : 6552
ఎయిడ్స్ : 1205
ఫైలేరియా : 2109
డయాలసిస్ : 258