
పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలి
సూర్యాపేట : విద్యార్థులు పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని ఎస్పీ కె.నరసింహ అన్నారు. శుక్రవారం సూర్యాపేట రూరల్ మండల పరిధిలోని ఇమాంపేటలో గల తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ బాలికల కళాశాలలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని, ఈ స్థాయికి ఎదగడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. మంచి మనసు, మంచి ఆలోచనలు మంచి మార్గంలో నడిపిస్తాయని తెలిపారు. సమయాన్ని వృథా చేయకుండా, ఒత్తిడికి గురవకుండా చదువుకోవాలన్నారు. సమస్యలు ఉంటే ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు చెప్పాలని, క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఎస్పీ కె.నరసింహ