
సర్కార్ బడిలో అడ్మిషన్ల సందడి
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చేపట్టిన బడిబాట సత్ఫలితాలు ఇచ్చింది. వేసవి సెలవులు ముగియగానే ఉపాధ్యాయ బృందం ఏప్రిల్ చివరి వారం నుంచి బడి బాట నిర్వహించడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఈ పాఠశాలలో జిల్లాలోనే అత్యధికంగా 203 మంది విద్యార్థులు నూతనంగా అడ్మిషన్లు తీసుకున్నారు. నాణ్యమైన బోధన, పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ, మధ్యాహ్న భోజనం అమలు వంటి పథకాలు ఆకర్శించాయి. కలెక్టర్, డీఈఓ, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా అవగాహన కల్పించారు.
నిర్వహించిన కార్యక్రమాలు ఇవే..
తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నాలుగు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటిని సందర్శించి బడి ఈడు పిల్లలను గుర్తించారు. కర పత్రాలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పాఠశాల మానేసిన వారిని సైతం గుర్తించి చేర్పించారు. పాఠశాలలో కొత్తగా 203 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఒక్క 6వ తరగతిలోనే 75 మంది విద్యార్థులు చేరారు. దీంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 460కి చేరింది. మరికొన్ని అడ్మిషన్లు పెరుగుతాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రవేశాల్లో తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లాలోనే మొదటి స్థానం నిలిచింది. అదే తీరులో తిరుమలగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో సైతం నూతనంగా 142 అడ్మిషన్లు వచ్చాయి. పాఠశాలలో ప్రస్తుతం 242 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
ఫ తిరుమలగిరి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చేరేందుకు విద్యార్థుల ఆసక్తి
ఫ 203కు చేరిన నూతన అడ్మిషన్లు
ఫ ప్రవేశాల్లో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచిన పాఠశాల
సమష్టి కృషితోనే అధిక సంఖ్యలో అడ్మిషన్లు
ఉపాధ్యాయుల సమష్టి కృషితో బడిబాట విజయవంతమైంది. జిల్లాలోనే ఎక్కువ 203 అడ్మిషన్లు పొంది ప్రథమ స్థానంలో చేరాం. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుంది. పదో తరగతి ఫలితాల్లో సైతం ఉత్తమ ఫలితాలు సాధించాం. – దామెర శ్రీనివాస్,
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
పాఠశాలలో నూతన
అడ్మిషన్ల వివరాలు
తరగతి ప్రవేశాలు
6 78
7 38
8 38
9 39
10 10
మొత్తం 203