యూరియా.. మళ్లీ క్యూ కట్టాలయ్యా..
జి.సిగడాం మండలం నడిమివలస
సచివాలయం వద్ద యూరియా కోసం మహిళలు, రైతులు పడిగాపులు
ఇదీ పరిస్థితి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
ఖరీఫ్ సీజన్‌లోనే కాదు రబీ సీజన్‌లో కూడా యూరియా కోసం రైతుకు పడిగాపులు తప్పడం లేదు. ఖరీఫ్‌లో రైతుల పడిన కష్టాలు చంద్రబాబు ప్రభుత్వానికి కనిపించలేదేమో. రైతులు ఏమైపోతే మాకేంటి ధోరణిలో రబీలోనూ అదే నిర్లక్ష్యం చూపిస్తోంది. దీంతో యూరియా కోసం రైతులు ఆపసోపాలు పడుతున్నారు. రైతుల అవసరాలను ప్రభుత్వం కనీసం అంచనా వేయడం లేదు. మూస పద్ధతిలో వెళ్లడం తప్ప రైతులకు యూరియా కొరతను తీర్చడంలో చర్యలు తీసుకోలేకపోయింది. రైతులను బాధ పెట్టాలన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
తెల్లవారకముందే రైతు సేవా కేంద్రాల వద్దకు చేరుకుని బారులు తీరి నిలబడుతున్నారు. సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత వేధిస్తూనే ఉంది. తెల్లారి లేచింది మొదలు తిండి తిప్పలు మాని ఎరువుల కోసం క్యూలు కట్టాల్సి వస్తోంది. అయినప్పటికీ యూరియా దొరకని పరిస్థితి నెలకొంటోంది. రబీ సీజన్‌లోను యూరియా కోసం రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. సాగు పనులు జోరుగా నడుతున్న తరుణంలో సచివాలయాల ఎదుట రైతులు నిరీక్షిస్తున్నారు. ఒక వైపు ఖరీఫ్‌లో పండిన పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కొనుగోళ్లు నెమ్మదిగా సాగడం, వాతావరణం ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా దళారులకు విక్రయించుకోవల్సిన దుస్థితి ఏర్పడింది. పండిన పంటను అమ్ముకోవడం ఒక వైపైతే.. రబీ సాగుకు అవసరమైన యూరియా కోసం మరో వైపు రైతులు అవస్థలు పడాల్సి వస్తోంది.
ఎరువులేవీ..?
రబీలో జిల్లాలో 70,319 హెక్టార్ల సాగు లక్ష్యంగా ఉంది. ఇందులో ఇప్పటికే 20వేల హెక్టార్లు సాగులోకి వచ్చేసింది. రబీ పంటల కోసం 26వేల మెట్రిక్ టన్నులు యూరియా అవసరమని యంత్రాంగం ప్రతిపాదించింది. ఇందులో 9600 మెట్రిక్ టన్నులు ఇప్పటికే పంపిణీ చేయగా, 3090 మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. యూరియా దొరకడం లేదని, రైతుకు ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారని, అది కూడా అందరికీ అందడం లేదని ఎక్కడికక్కడ రిపోర్టు వస్తోంది. వాస్తవంగా ఖరీఫ్ సీజన్‌లో యూరియా కోసం రైతులు ఎంత ఇబ్బందులు పడ్డారో రాష్ట్రమంతా చూసింది. ఒక బస్తా కోసం గొడవలు జరిగాయి. కొట్లాటలకు దారి తీశాయి. చివరికి వ్యవసాయ సిబ్బందిపై దాడి చేసేంత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సాక్షాత్తూ సంబంధిత వ్యవసాయ శాఖ సిబ్బందే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. పరిస్థితు లు బాగోలేవని, యూరియా కోసం రైతుల నుంచి ఇబ్బందులు పడుతున్నామని ముఖ్యంగాఅగ్రికల్చర్ అసిస్టెంట్‌లు గగ్గోలు పెట్టారు. వచ్చిన యూరియా కాస్త టీడీపీ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఎక్కడికక్కడ రైతులు ఆందోళనలకు దిగారు. కార్యాలయాలను ముట్టడించేంతవరకు వెళ్లారు.
వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలో..
ఎంత కాదనుకున్నా మంత్రులు స్వప్రయోజనం చూసుకుంటారన్నది నానుడి. తమ నియోజకవర్గానికి, తమ జిల్లాకు మంచి జరిగే నిర్ణయాలు తీసుకుంటారనేది అందరికీ తెలిసిందే. కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు అలాంటిదేమీ కనిపించడం లేదు. సొంత జిల్లా రైతులకు మేలు చేద్దామన్న ఆలోచన రావడం లేదు. రైతుల కంటే మిగతా రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని చూసైనా నేర్చుకోరా..
వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రతీది రైతు ఇంటి వద్దకే వచ్చేది. విత్తనాలు, ఎరువుల సరఫరా దగ్గరి నుంచి ధాన్యం కొనుగోళ్లు వరకు రైతుల వద్దనే జరిగేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు ఎంత సాగు చేస్తున్నారో? వారికెంత ఎరువులు అవసరమో? ఈ క్రాప్ ద్వారా ముందే గుర్తించేవారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌లు ఇంటింటికి వెళ్లి సర్వే చేసి వివరాలు తీసుకునేవారు. ఆ మేరకు రైతులకు సరిపడా ఎరువులు నేరుగా ఇంటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేవారు. ఎరువుల కోసం ఎవరినీ అడగాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు మళ్లీ పాత కష్టాలు పునరావృతమయ్యాయి. గొడవలకు పరిస్థితులు దారితీస్తున్నాయి.
రైతులను వదలని ఇబ్బందులు
ఎరువుల కోసం మళ్లీ పాట్లు
వ్యవసాయ మంత్రి సొంత జిల్లాలో తప్పని అవస్థలు
సరిపడా యూరియా దొరకని దుస్థితి
బారులు తీరి గగ్గోలు పెడుతున్న రైతులు
మళ్లీ గొడవలకు దారి తీస్తున్న పరిస్థితులు


