డయేరియా బాధితులకు మెరుగైన వైద్యసేవలు
సంతబొమ్మాళి: తాళ్లవలస డయేరియా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందజేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. సంతబొమ్మాళి మండలం తాళ్లవలసలో డయేరియా కేసులు నమోదైన నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం డయేరియా అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. టెక్కలి కేంద్రం నుంచి ఇంటింటికి కుళాయిలు ద్వారా నీటిని అందించేందుకు ప్రణాళిక రూపొందించామని, దీనికి రూ. 60లక్షలు మంజూరు చేశామన్నారు. తాగునీటిలో ఎటువంటి సమస్య లేదన్నారు. మరింత కచ్చితత్వం కోసం బ్లాడ్ శాంపిల్స్‌తో పాటు, మంచినీటి నమూనాలను విశాఖపట్నంలోని అత్యాధునిక లేబొరేటరీకి పంపించామన్నారు. డ్రైనేజీ నీరు ఎట్టి పరిస్థితుల్లో చెరువులో కలవకుండా చర్యలు చేపట్టాలని అధికారులను అదేశించారు. కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ డయేరియా తాగునీటి వల్ల రాలేదని, ఆహారం ఇన్‌డైజేషన్ వల్ల వాంతులు విరోచనాలు అయ్యాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య, టెక్కలి ఆర్‌డీవో కృష్ణమూర్తి, డీఎంహెచ్‌వో కె.అనిత, తహసీల్దార్ హేమసుందర్‌రావు, ఇన్‌చార్జీ ఎంపీడీఓ దుంప శ్రీనివాసరావు, పీహెచ్‌సీ డాక్టర్ గంగాధర్ విశ్వనాధ్ తదితరులు ఉన్నారు. కాగా, గ్రామంలో మంగళవారం మరో డయేరియా కేసు నమోదైంది. గ్రామానికి చెందిన రాజాపు లక్ష్మమ్మ వాంతులు, విరోచనాలు కావడంతో గ్రామంలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులోనే పీహెచ్‌సీ సిబ్బంది వైద్య సేవలు అందించారు. గుడ్లు తినడం వల్ల డయేరియా వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు.


