
వైద్యాధికారులతో సమీక్షిస్తున్న డీఎంహెచ్‌ఓ మీనాక్షి
అరసవల్లి: జిల్లాలో అన్ని ప్రాంతాల్లోనూ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈ నెలాఖరు లోగా పూర్తి చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.మీనాక్షి ఆదేశించారు. శనివారం స్థానిక కార్యాలయంలో పారామెడికల్ ఆప్తాలమిక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి, కనీసం నెలలో రెండుసార్లు ఆరోగ్య తనిఖీలు చేయించుకునేలా చూడాలన్నారు. ఎక్కడా మాతాశిశు మరణాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్ భాస్కరరావు, డీఐఓ ఆర్.వి.ఎస్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో లక్ష్మీతులసి, వైద్యులు పద్మావతి, విద్యుల్లత, ఉమాసౌజన్య, భాస్కరరావు, అనంతలక్ష్మి, త్రినాథరావు, డెమో వెంకటరమణ పాల్గొన్నారు.