
పేకాటరాయుళ్ల అరెస్ట్
బత్తలపల్లి: స్థానిక మారుతీనగర్‌లో పేకాట ఆడుతున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ సోమశేఖర్ తెలిపారు. వివరాలను ఆయన వెల్లడించారు. అందిన పక్కా సమాచారంతో శుక్రవారం మారుతీనగర్‌లోని జొన్నలగడ్డ రంగనాయుడు ఇంటి పక్కన ఉన్న రేకుల షెడ్డు వద్దకు డీఎస్పీ హేమంత్‌కుమార్‌తో పాటు సిబ్బంది చేరుకున్నారు. ఆ సమయంలో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.1,01,050 నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జూదరులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. తనిఖీల్లో స్థానిక పోలీసులతో పాటు డీఎస్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నట్లు ఎస్‌ఐ సోమశేఖర్ తెలిపారు.
హత్య కేసు నమోదు
ధర్మవరం అర్బన్: ఈ ఏడాది మే 29న గుర్తు తెలియని వ్యక్తులు ధర్మవరంలోని గీతానగర్‌లో నివాసముంటున్న చింతా రమాదేవి(55) ఇంట్లో చొరబడి ఆమె గొంతుకు తాడు బిగించి హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం మృతి చెందడంతో దుండగులపై హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. కాగా, ఆమె భర్త సుబ్రహ్మణ్యం కొన్నేళ్ల క్రితమే మృతి చెందాడు. ఒంటరిగా జీవిస్తున్న తన తల్లిపై హత్యాయత్నం చేశారంటూ కూతురు దీపిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.