
కార్మికుల జీవితాలతో చెలగాటమొద్దు
అనంతపురం అర్బన్: కార్మికుల జీవితాలతో చెలగాటమాడరాదని కూటమి ప్రభుత్వాన్ని శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు హెచ్చరించారు. ఏడు నెలలుగా బకాయిపడిన వేతనాన్ని తక్షణమే చెల్లించాలంటూ శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఐఎఫ్‌టీయూ ఏసురత్నం, రైతు కూలీ సంఘం రాయుడు, భవన నిర్మాణ కార్మిక సంఘం రామకృష్ణ మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా ఆ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు జి.ఓబుళు మాట్లాడుతూ.. నెలలుగా వేతనం చెల్లించకపోతే కార్మికులు ఎలా బతుకుతారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. వేతనాలు చెల్లించాలంటూ 85 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ఇటు ప్రభుత్వం కానీ, అటు అధికారులు కానీ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. యోగా డే అంటూ వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన కూటమి ప్రభుత్వానికి కార్మిక కుటుంబాల ఆకలి కేకలు వినిపించడం లేదని మండిపడ్డారు. తక్షణమే ఏడు నెలల వేతన, 40 నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఏబీఆర్ నుంచి హిందూపురం వరకూ ట్రంక్‌లైన్ కార్మికులకు ఆరు నెలల వేతనాలు, 26 నెలల పీఎఫ్ బకాయి చెల్లించాల్సి ఉందన్నారు. ఫేస్–4 కళ్యాణదుర్గం, రాయదుర్గం, మడకశిర కార్మికులకు రెండు నెలల వేతనం, 18 నెల పీఎఫ్, మడకశిర కార్మికులకు మూడు నెలల వేతనం, 36 నెలల పీఎఫ్, హిందూపురం కార్మికులకు 15 నెలల వేతనం, 15 నెలల పీఎఫ్ చెల్లించాల్సి ఉందన్నారు. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చుతూ కార్మికులకు బకాయిలు చెల్లించినట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.5 కోట్ల నిధులు విడుదలైనట్లు కలెక్టర్ ఐదు రోజుల క్రితం ప్రకటించారని, అయితే ఆ డబ్బు నేటికీ కార్మికుల ఖాతాల్లో జమ కాలేదన్నారు. కార్మికుల బకాయిలు పూర్తిగా చెల్లించే వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎర్రిస్వామి, రాము, తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు
ఏడు నెలల బకాయి వేతనాలను
తక్షణమే చెల్లించాలి
అనంత కలెక్టరేట్ ఎదుట ధర్నా
మద్ధతు పలికి న సీపీఎం, వైఎస్సార్‌టీయూ, ఐఎఫ్‌టీయూ, రైతుసంఘాలు