
సాక్షి, పుట్టపర్తి:
దశాబ్దాల క్రితం గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రాష్ట్రంలో సాకారమైంది. పల్లెల్లో ప్రజల మధ్యనే పరిపాలన సాగుతోంది. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లతో స్థానికంగానే సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ఆరోగ్యంపై ప్రజలకు ప్రభుత్వం భరోసా కల్పించింది. తాజాగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’తో మరింత సేవ చేసేందుకు సిద్ధమైంది.
ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు
ప్రభుత్వ సేవలన్నీ ప్రజల వద్దకే వస్తున్నాయి. ఒకటో తారీఖు ఉదయాన్నే ఇంటి వద్దకే వచ్చి పింఛన్ అందజేస్తున్నారు. ప్రభుత్వం తరఫున అందాల్సిన ప్రతి ఫలం నేరుగా బ్యాంకు ఖాతాలో చేరుతోంది. పల్లె నుంచి పట్టణం వైపు కన్నెత్తి చూడాల్సిన పని లేకుండా పోయింది. అన్ని రకాల మౌలిక వసతులతో కూడిన ప్రభుత్వ భవనాలు అందుబాటులోకి రావడంతో విద్య, వైద్యం, రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ తదితర సేవలన్నీ తక్షణమే స్వగ్రామంలోనే అందుతున్నాయి. రేషన్ దుకాణాల దగ్గర వేచి ఉండాల్సిన పని లేదు. ఇంటి వద్దకే రేషన్ సరుకులు వస్తున్నాయి. గతంలో స్థానికంగా ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు కూడా తిరిగి వచ్చేశారు. గ్రామాల్లో పొలాలన్నీ సస్యశ్యామలంగా మారాయి. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చర్యలు చరిత్రాత్మకమని కొనియాడుతున్నారు.
గ్రామ స్వరాజ్యం.. సాకారం
ఉన్న ప్రాంతంలోనే ప్రజలకు
అన్ని రకాల సేవలు
సచివాలయాలు, ఆర్‌బీకేలతో
తగ్గిన వ్యయప్రయాసలు
ఆరోగ్యానికి భరోసా ఇస్తోన్న
‘ఫ్యామిలీ డాక్టర్’ విధానం
సీఎం జగన్ చర్యలు
చరిత్రాత్మకమంటున్న ప్రజలు
ఇక్కడ కనిపిస్తున్న యువకుడి పేరు శశికుమార్. మడకశిర మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఉన్న ఊరిలోని సచివాలయంలో పైసా ఖర్చు లేకుండా రేషన్ కార్డు పొందాడు. గతంలో ఏదైనా సమస్య ఉంటే గ్రామస్తులు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మడకశిర వెళ్లాల్సి వచ్చేది. సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక్క దరఖాస్తు ఇవ్వగానే.. అనతి కాలంలోనే సమస్యలు పరిష్కారం అవుతున్నాయని శశికుమార్ తెలిపాడు.
చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు సావిత్రమ్మ. తాడిమర్రి మండలం మరువపల్లి వాసి. ఎన్నో ఏళ్లుగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతోంది. గతంలో ధర్మవరం ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకునేది. ప్రస్తుతం గ్రామంలోనే బీపీ, షుగర్, థైరాయిడ్ పరీక్షలు చేయించుకుంటోంది. దూర ప్రాంతాలకు వెళ్లే పని లేకుండా స్థానికంగా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని వృద్ధురాలు హర్షం వ్యక్తం చేసింది.

మడకశిర మండలం బుళ్లసముద్రం సచివాలయంలో సేవల కోసం వచ్చిన ప్రజలు

