
శ్రీ సత్యసాయి: తమది బీసీల పార్టీ అంటూ గొప్పలు చెప్పే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తన యువగళం పాదయాత్రలో వాల్మీకులను తీవ్రంగా అవమానించారు. రామాయణాన్ని రచించి అందరికీ ఆరాధ్య దైవమైన వాల్మీకి మహర్షికి కనీసం దండం పెట్టే సమయం కూడా లేదన్నట్లు వ్యవహరించాడు. వివరాల్లోకి వెళితే...లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర బుధవారం సోమందేపల్లి మండలం నలగొండ్రాయనిపల్లి నుంచి ప్రారంభమైంది.
ఈ క్రమంలో సోమందేపల్లిలోని వాల్మీకి విగ్రహానికి లోకేశ్‌తో పూలమాల వేయించాలని టీడీపీకి చెందిన వాల్మీకి నాయకులు సిద్ధమయ్యారు. ఈ మేరకు వాల్మీకి విగ్రహానికి పూలతో అలంకరించారు. పెద్ద గజమాల కూడా సిద్ధం చేసి లోకేశ్ కోసం వేచి చూశారు. పాదయాత్ర సమీపంలోకి రాగానే ఎదురెళ్లి స్వాగతం పలికారు. వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసేందుకు ఆహ్వానించారు. అయితే వారి వినతిని పెద్దగా పట్టించుకోని లోకేశ్ నవ్వుకుంటూ ముందుకు సాగిపోయారు. దీంతో అక్కడున్న వాల్మీకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తాము తెచ్చిన గజమాలను వాల్మీకి మహర్షి విగ్రహానికి వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిబట్టి చూస్తే టీడీపీకి బీసీలు, ముఖ్యంగా వాల్మీకులంటే ఏమాత్రం ప్రేమ ఉందో తెలుస్తోందన్నారు.
జనం లేక అసహనం..
లోకేశ్ చేపట్టిన పాదయాత్ర బుధవారం 44వ జాతీయ రహదారి మీదుగా సాగింది. ఉదయం కనిపించిన పలువురు టీడీపీ నేతలు కొంతసేపటికే అక్కడినుంచి జారుకున్నారు. దీంతో ఎప్పటిలాగే నెలవారీ జీతంతో యువగళంలో పాల్గొంటున్న వారే లోకేశ్‌తో ముచ్చట్లు చెబుతూ వెంట నడిచారు. దీంతో స్థానిక నేతలపై అసహనం వ్యక్తం చేసిన లోకేశ్... జాతీయ రహదారి పక్కనే ఉన్న కే–9లో కాసేపు సేదదీరి పలువురితో మాట్లాడారు. కాగా, తాను పట్టణంలో కొనసాగిస్తున్న అన్నా క్యాంటీన్‌ను లోకేశ్‌కు చూపించాలని టీడీపీ నాయకురాలు సవితమ్మ భావిస్తుడంగ, ఆమెకు చెక్ పెట్టేందుకు బీకే పార్థసారథి సిద్ధమైనట్లు తెలుస్తోంది.