
సాక్షి, పుట్టపర్తి: ప్రజా సమస్యలు వింటూ, వారికి భరోసా ఇస్తానంటూ చేపట్టిన లోకేష్ పాదయాత్ర అభాసుపాలవుతోంది. అర్థం పర్థం లేని ఆయన ప్రసంగాలు విని ప్రజలు విసుక్కుంటున్నారు. అందువల్లే జిల్లాలో ‘యువగళం’ పాదయాత్రకు ఎక్కడా ప్రజా స్పందన కనిపించ లేదు. దీంతో ఎలాగైనా ప్రజల అటెన్షన్ తనవైపు మళ్లించుకునేందుకు లోకేష్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. అధికార పార్టీని టార్గెట్ చేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
ముఖ్యంగా ఎమ్మెల్యేలపై నోరు పారేసుకుంటూ రెచ్చగొడుతున్నాడు. దీనికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ కౌంటర్ ఇస్తుండగా.. అది ప్రజల్లోకి బాగా వెళ్తోంది. అలాగైనా తన పేరు జనం నోళ్లలో నానుతుందని భావిస్తున్న లోకేష్ మరింత రెచ్చిపోతూ ప్రసంగాలు చేస్తున్నారు. అదే బాటలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు నడుస్తున్నారు. ఈక్రమంలోనే జిల్లాలో ప్రవేశించింది మొదలు ఇప్పటికి మూడు నియోజకవర్గాల మేర సాగిన ‘యువగళం’లో లోకేష్ ఇప్పటి వరకు ఎక్కడా ప్రజలతో మాట్లాడిన సందర్భమే లేదు. ఎంతసేపు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, సీఎం జగన్‌పై విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చారు.
సెల్ఫీలకే పరిమితం..
‘యువగళం’ పాదయాత్రలో భాగంగా అభిమానులతో సెల్ఫీలు దిగేందుకే లోకేష్ అధిక సమయం వెచ్చిస్తున్నారు. ఫొటోలకు ఫోజులు, నాయకులతో మాట్లాడుతున్న స్టిల్స్, బహిరంగ సభల్లో హావభావాలు తదితర అన్ని అంశాల్లోనూ పబ్లిసిటీ పిచ్చి స్పష్టంగా కనిపిస్తోంది. న్యాయవాదులు, మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలంటూ వివిధ వర్గాలతో లోకేష్ భేటీ అవుతున్నా... వాళ్లతో మాట్లాడటం పక్కన పెట్టి ‘సెల్ఫీ ప్లీజ్’ అంటూ ఆయనే సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసుకుంటున్నారు.
తారస్థాయికి అంతర్గత పోరు..
కదిరిలో కత్తులు దూసుకుంటున్న అత్తార్ చాంద్‌బాషా – కందికుంట వెంకట ప్రసాద్ వర్గాల మధ్య యువగళం కొత్త చిచ్చుపెట్టింది. ఇన్నాళ్లూ అంతర్గంతా సాగిన నేతల ఆధిపత్యపోరు లోకేష్ పాదయాత్రలో బట్టబయలైంది. ఇరువురు నేతలూ పోటాపోటీగా సమావేశాలు నిర్వహించి బల నిరూపణ చేసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె రఘునాథరెడ్డికి దీటుగా అసమ్మతి నేతలు పెదరాసు సుబ్రమణ్యం, పీసీ గంగన్న సమావేశాలు నిర్వహించారు. పెనుకొండలో ఓ వైపు సవితమ్మ, మరోవైపు నిమ్మల కిష్టప్ప, ఇంకోవైపు బీకే పార్థసారథి ఎవరికి వారు స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్నారు.
పెనుకొండలో ఫ్లెక్సీల చిచ్చు..
‘యువగళం’ పెనుకొండ నియోజకవర్గంలో ప్రవేశించిన నాటి నుంచి ఫ్లెక్సీల చిచ్చు రగులుతూనే ఉంది. గోరంట్లలో నిమ్మల కిష్టప్ప తన ఫ్లెక్సీలతో నింపేశారు. ఎక్కడా నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ బీకే పార్థసారథి ఫొటో కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఈ ఘటనతో తేరుకున్న బీకే పార్థసారథి సోమందేపల్లి మండలంలో సవితమ్మ ఫ్లెక్సీలు ఉండకూడదని స్థానిక నేతలకు ఆదేశాలిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సవితమ్మ వెంటనే సమస్యను లోకేష్‌కు వివరించారు. దీంతో ఆమె ఫ్లెక్సీలు తొలగించకుండా ఉంచినట్లు తెలిసింది. ఇక ‘యువగళం’ పాదయాత్రను పెనుకొండ పట్టణంలోకి తీసుకెళ్లాలని సవితమ్మ భావిస్తుండగా, షెడ్యూల్ ప్రకారం జాతీయ రహదారి మీదుగానే సాగాలని బీకే పార్థసారథి పట్టుబట్టినట్లు తెలిసింది. గురువారం ఉదయం లోకేష్ ఎటు వెళ్తారనే దానిపై స్పష్టత లేదు. నేరుగా గుట్టూరు వెళ్లాలని ముందస్తు ప్లాన్ ఉంది. సవితమ్మ పట్టు సాధిస్తారా? లేక బీకే మాట గెలుస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.