T20 WC 2022: గత రికార్డులన్నీ బ్రేక్‌ చేసిన ఇండియా-పాక్‌ మ్యాచ్‌ | T20 WC 2022: IND VS PAK Match Creates New Viewership Record | Sakshi
Sakshi News home page

T20 WC 2022: గత రికార్డులన్నీ బ్రేక్‌ చేసిన ఇండియా-పాక్‌ మ్యాచ్‌

Oct 23 2022 8:38 PM | Updated on Oct 25 2022 5:53 PM

T20 WC 2022: IND VS PAK Match Creates New Viewership Record - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా భారత్‌-పాక్‌ల మధ్య ఇవాళ జరిగిన మ్యాచ్‌ క్రికెట్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో విరాట్‌ వీరోచితంగా పోరాడి టీమిండియాకు మరపురాని విజయాన్నందించాడు. ఈ మ్యాచ్‌ పలు వ్యక్తిగత రికార్డులకు వేదిక కావడంతో పాటు వ్యూయర్షిప్‌ పరంగా గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది.  

ఈ సండే ధమాకా అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పంటపండించగా.. డిజిటల్‌ ప్లాట్‌ఫాం డిస్నీ హాట్ స్టార్ గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసి ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. ఇవాల్టి మ్యాచ్‌ను డిజిటల్‌ ప్లాట్‌ఫాంపై ఏకంగా కోటి 80 లక్షల మంది వీక్షించారు. డిజిటల్‌ ప్లాట్‌ఫాం చరిత్రలో ఇదే అత్యధికం. ఈ ఏడాది ఆసియా కప్‌లో జరిగిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు కోటి 30 లక్షల వ్యూస్‌ లభించగా.. తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఆ రికార్డును బ్రేక్‌ చేసి డిజిటల్‌ ప్లాట్‌ఫాంపై సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఇదిలా ఉంటే, టీ20 క్రికెట్‌లో అసలుసిసలైన మజా ఇవాళ (అక్టోబర్‌ 23) జరిగిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో దొరికింది. చివరి నిమిషం నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ సమరంలో టీమిండియా.. దాయాది పాక్‌ను 4 వికెట్ల తేడాతో మట్టికరిపించి, ఆసియా కప్‌-2022, గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవాలకు ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ విశ్వరూపం (53 బంతుల్లో 82 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రదర్శించి ఛేదనలో రారాజు తనేనని మరోసారి ప్రపంచానికి చాటాడు. కోహ్లి వీరోచిత పోరాటానికి హార్ధిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన (40, 3/30) తోడవ్వడంతో భారత్‌ చిరకాలం గుర్తుండిపోయే అపురూప విజయాన్ని సాధించింది.
చదవండి: Ind Vs Pak: విరాట్‌ వీరోచిత పోరాటం.. సలాం కొడుతున్న క్రీడాలోకం

Advertisement
 
Advertisement
Advertisement