'స్టైల్ కొట్టాలని చూశాడు.. టీమిండియా కొంపముంచాడు' | Sunil Gavaskar blames dropped catch on urge to make it look a lot better than it was | Sakshi
Sakshi News home page

IND vs WI: 'స్టైల్ కొట్టాలని చూశాడు.. టీమిండియా కొంపముంచాడు'

Oct 10 2026 9:36 AM | Updated on Oct 10 2026 9:45 AM

Sunil Gavaskar blames dropped catch on urge to make it look a lot better than it was

రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆతిథ్య భారత జట్టుకు వెస్టిండీస్ ఊహించని షాకిచ్చింది. టీమిండియా నిర్దేశించిన 250 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించిన విండీస్.. తమ టీ20 చరిత్రలోనే అత్యంత ఘనమైన విజయాన్ని నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, బౌలర్ల వైఫల్యం జట్టు కొంపముంచింది. ఒక్క మయాంక్ యాదవ్ తప్ప మిగతా బౌలర్లు తీవ్రంగా నిరాశపరిచారు. అయితే బౌలింగ్‌లో రాణించిన మయాంక్.. ఫీల్డింగ్‌లో చేసిన ఒకే ఒక్క పొరపాటు మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది.

మ్యాచ్ స్వరూపాన్ని మార్చిన లడ్డూ లాంటి క్యాచ్!

కొండంత లక్ష్య ఛేదనలో మయాంక్ దాటికి వెస్టిండీస్ 58 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, కెప్టెన్ షాయ్ హోప్‌తో కలిసి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 15 బంతుల్లోనే 37 పరుగులు సాధించి డేంజర్‌గా మారాడు. దీంతో అతడిని కట్టడి చేసేందుకు కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు బంతిని ఇచ్చాడు.

ఇన్నింగ్స్ 10వ ఓవర్ చివరి బంతిని కుల్దీప్ తెలివిగా స్లో డెలివరీగా వేశాడు. కుల్దీప్ ట్రాప్‌లో చిక్కుకున్న రూథర్‌ఫోర్డ్, షార్ట్ ఫైన్ లెగ్ మీదుగా షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో బంతి నేరుగా అక్కడే ఉన్న ఫీల్డర్ మయాంక్ యాదవ్ చేతుల్లోకి వెళ్లింది. కానీ మయాంక్ ఆ సులువైన క్యాచ్‌ను జారవిడిచాడు.

39 పరుగుల వద్ద లభించిన ఈ లైఫ్‌లైన్‌ను రూథర్‌ఫోర్డ్ ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత మరింత విజృంభించి ఆడిన అతడు కేవలం 37 బంతుల్లోనే 84 పరుగులు చేసి విండీస్  విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఒకవేళ మయాంక్ ఆ క్యాచ్ పట్టి ఉంటే భారత్ ఖచ్చితంగా విజయం సాధించేది.

గవాస్కర్ ఫైర్!

ఈ సులువైన క్యాచ్ జారవిడవడంపై కామెంట్రీ బాక్స్‌లో ఉన్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ఆటగాళ్ల అనవసరమైన హడావుడి, షోఆఫ్ వల్లే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయని మండిపడ్డాడు.

"ప్రతి క్యాచ్ పట్టిన తర్వాత కిందపడిపోవాలనే ఆతృత చాలా మంది ఆటగాళ్లలో కనిపిస్తోంది. తాము పట్టిన క్యాచ్‌ను గొప్పగా చూపించుకోవాలనే ఉద్దేశంతో అలా చేస్తూ బ్యాలెన్స్ కోల్పోతున్నారు. 

దానివల్ల సులువైన క్యాచ్‌లను కూడా జారవిడుస్తున్నారు. ఫీల్డింగ్ చేసేటప్పుడు స్థిరంగా ఉంటూ బ్యాలెన్స్‌ను కాపాడుకోండి. కిందపడటం ముఖ్యం కాదు, బంతిని సరిగ్గా పట్టుకోవడం ముఖ్యం" అని గవాస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: అదే మా కొంపముంచింది.. వారు మాత్రం అత్యద్భుతం: శ్రేయస్‌ అయ్యర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement