source: X
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ స్మృతి మంధనకు అరుదైన గౌరవం దక్కింది. యునిసెఫ్ ఇండియా ఆమెను సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియమించింది. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా యునిసెఫ్ ఇవాళ ఈ ప్రకటన విడుదల చేసింది.
బాలికల హక్కులు, భద్రత, ఆరోగ్యం, సమాన అవకాశాలపై అవగాహన కల్పించడంలో స్మృతి కీలక పాత్ర పోషించనుంది. బాలికలు చదువుకోవడంతోపాటు క్రీడల్లో రాణించి, తమ లక్ష్యాలను చేరుకునేలా ప్రోత్సహించేందుకు యునిసెఫ్ చేపట్టే కార్యక్రమాలకు ఆమె మద్దతుగా నిలవనుంది.
ఈ బాధ్యత దక్కడం గౌరవంగా భావిస్తున్నానని స్మృతి తెలిపింది. ప్రతి చిన్నారికి పెద్ద కలలు కనడంతోపాటు వాటిని నిజం చేసుకునే అవకాశం ఉండాలని పేర్కొంది. గతంలోనూ ఆమె బాలికల సమానత్వం, పిల్లల హక్కులపై యునిసెఫ్ నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది.
యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రీ మాట్లాడుతూ.. స్మృతి ప్రయాణం బాలికలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. ప్రతిభకు సరైన అవకాశాలు తోడైతే అద్భుతాలు సాధించవచ్చని ఆమె విజయాలు నిరూపిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇటీవలే భారత మహిళల జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన స్మృతి.. 2025లో భారత్ తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యురాలు. అదే ఏడాది వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యికి పైగా పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. 2026లోనూ అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో పరుగుల పరంగా అగ్రస్థానానికి చేరుకుంది.
ఇదీ చదవండి: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్


