టీమిండియా (PC: BCCI X)
భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో ప్రజ్ఞాన్ ఓజా సెలక్షన్ కమిటీ తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ప్రజ్ఞాన్ ఓజాతో పాటు
ఈ నేపథ్యంలో టీమిండియా చీఫ్ సెలక్టర్ రేసులో ప్రజ్ఞాన్ ఓజాతో పాటు మరో భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ కూడా ఉన్నాడనే వార్తలు వచ్చాయి. వీరిద్దరిలో ఒకరు సెలక్షన్ కమిటీ చైర్మన్ కావడం ఖాయమని బీసీసీఐ సన్నిహిత వర్గాలు గతంలో జాతీయ మీడియాకు వెల్లడించాయి.
దరఖాస్తు చేయనేలేదు
అయితే, PTI అందించిన తాజా సమాచారం ప్రకారం.. పార్థివ్ పటేల్ ఈ పోటీ నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. అతడు అసలు సెలక్టర్ పోస్టు కోసం కూడా దరఖాస్తు చేయలేదని సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ..
‘‘వెస్ట్ జోన్ నుంచి అగార్కర్ నిష్క్రమణతో ఖాళీ అయిన స్థానానికి పార్థివ్ పటేల్ దరఖాస్తు చేయలేదు. బీసీసీఐ ఇచ్చిన గడువు ఈరోజు (అక్టోబరు 14) సాయంత్రం ఐదు గంటలకు ముగిసిపోయింది. ఒకవేళ బీసీసీఐ గడువు పొడిగిస్తే మాత్రమే పార్థివ్‌కు అప్లై చేసే అవకాశం ఉంటుంది’’ అని పేర్కొన్నాయి.
కాగా సౌత్ జోన్ నుంచి ప్రజ్ఞాన్ ఓజా టీమిండియా సెలక్టర్‌గా ఉన్న విషయం తెలిసిందే. పార్థివ్ రేసు నుంచి తప్పుకోవడంతో ఓజానే పూర్తి స్థాయి చీఫ్ సెలక్టర్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. పార్థివ్ పటేల్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా కొనసాగనున్నట్లు సమాచారం.
వెస్ట్ జోన్ నుంచి అతడే!
ఇదిలా ఉంటే.. వెస్ట్ జోన్ నుంచి మరో మాజీ క్రికెటర్ రమేశ్ పవార్ టీమిండియా సెలక్టర్‌గా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి పవార్ జూనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ చైర్మన్ కానున్నాడనే వార్తలు రాగా.. ఇప్పుడు అతడు సీనియర్ జట్టు సెలక్టర్‌గా రేసులోకి వచ్చినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.


