Ind Vs Eng 1st ODI Details: ముఖాముఖి రికార్డులు, తుది జట్ల అంచనా.. పూర్తి వివరాలు! ఇక టాస్‌ గెలిచిన జట్టు తొలుత..

Ind Vs Eng 1st ODI: Probable Playing XI And Pitch Condition Other Details - Sakshi

ఓవల్‌ రికార్డులు తెలుసా?

India Vs England ODI Series 2022: టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా వన్డే సిరీస్‌లోనూ ఇంగ్లండ్‌ను మట్టికరిపించాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో లండన్‌లోని కెనింగ్‌టన్‌ ఓవల్‌ వేదికగా మంగళవారం మొదటి వన్డే ఆడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో గెలుపే లక్ష్యంగా రోహిత్‌ సేన బరిలోకి దిగుతుండగా... బట్లర్‌ బృందం బదులు తీర్చుకునేందుకు సన్నద్ధమవుతోంది.

కాగా టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు విదేశాల్లో ఇదే తొలి వన్డే సిరీస్‌. మరోవైపు ఇయాన్‌ మోర్గాన్‌ రిటైర్మెంట్‌ తర్వాత ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల జట్టు పగ్గాలు చేపట్టిన జోస్‌ బట్లర్‌కు సైతం సారథిగా ఇదే మొదటి వన్డే సిరీస్‌ కావడం విశేషం. దీంతో ఇరుజట్లకు మొదటి మ్యాచ్‌ మరింత కీలకంగా మారింది.

మరి.. వన్డేల్లో టీమిండియా- ఇంగ్లండ్‌ ముఖాముఖి రికార్డులు, ఓవల్‌ మైదానంలో ఇరు జట్ల మధ్య జరిగిన పోటీలో పైచేయి ఎవరిది? తుది జట్ల అంచనా? పిచ్‌ వాతావరణం, మ్యాచ్‌ ప్రసార సమయం తదితర అంశాలు గమనిద్దాం.

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ హెడ్‌ టూ హెడ్‌ రికార్డ్స్‌
భారత్‌- ఇంగ్లండ్‌ జట్లు ఇప్పటి వరకు 103 వన్డేల్లో ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో 55 సార్లు టీమిండియాను విజయం వరించగా.. ఇంగ్లండ్‌ 43 మ్యాచ్‌లలో గెలుపొందింది. ఇక మూడు మ్యాచ్‌లలో ఫలితం తేలకపోగా... రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

పిచ్, వాతావరణం
దాదాపుగా ఇంగ్లండ్‌ పిచ్‌లన్నీ పేస్‌కు అనుకూలమైనవే! అదే విధంగా.. ‘ద ఓవల్‌’ మైదానం కూడా అంతే. టాస్‌ నెగ్గిన జట్టు బ్యాటింగ్‌కు మొగ్గు చూపొచ్చు. అయితే, ఓవల్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు గెలిచిన సందర్భాలు తక్కువగా ఉండటం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. చిరుజల్లులు కురిసినా మ్యాచ్‌కు అవాంతరమైతే ఉండకపోవచ్చు.

ఓవల్‌లో గత ఐదు మ్యాచ్‌లలో ఎవరిది పైచేయి?
ద ఓవల్‌ మైదానంలో ఇంగ్లండ్‌- ఇండియా తలపడిన గత ఐదు మ్యాచ్‌లలో ఆతిథ్య జట్టుదే పైచేయిగా ఉంది. టీమిండియా రెండుసార్లు గెలవగా.. ఇంగ్లండ్‌ మూడుసార్లు ఏకపక్ష విజయాలు సాధించింది.

ఓవల్‌ వన్డే రికార్డు.. మీకు తెలుసా?
ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన మ్యాచ్‌లు: 75
మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లు గెలిచిన సందర్భాలు: 30
లక్ష్య ఛేదనకు దిగిన జట్లు విజయం సాధించిన సందర్భాలు: 41
ఇక్కడ నమోదైన అత్యధిక స్కోరు: ఇంగ్లండ్‌ మీద న్యూజిలాండ్‌ 398/5.
అత్యల్ప స్కోరు: దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ స్కోరు: 103/10

తుది జట్లు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్, విరాట్‌ కోహ్లి, రిషభ్‌ పంత్, సూర్యకుమార్ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, ప్రసిధ్‌కృష్ణ, యజువేంద్ర చహల్‌. 

ఇంగ్లండ్‌: జోస్‌ బట్లర్‌ (కెప్టెన్‌), జేసన్‌ రాయ్, సాల్ట్, బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్, మొయిన్‌ అలీ, లివింగ్‌స్టోన్, విల్లే, కార్స్, రీస్‌ టోప్లే, సామ్‌ కరన్‌. 

మ్యాచ్‌ ఎప్పుడు? ఎక్కడ?
వేదిక: కెనింగ్‌టన్‌ ఓవల్‌, లండన్‌
సమయం: భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ప్రసారం
చానెల్‌: సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

కాగా రీషెడ్యూల్డ్‌ టెస్టులో ఇంగ్లండ్‌ విజయం సాధించగా టెస్టు సిరీస్‌ 2-2తో సమమైంది. మరోవైపు టీ20 సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

చదవండి: Eng Vs Ind 1st ODI: ఇంగ్లాండ్‌తో వన్డే.. టీమిండియాకు బిగ్‌ షాక్! 
Surya Kumar Yadav: ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్యకుమార్‌ యాదవ్‌! మాక్సీ రికార్డు బద్దలు.. మరెన్నో!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top