IPL 2022 DC Vs RR: నో బాల్ రాద్ధాంతం.. పంత్, శార్దూల్‌లకు భారీ షాక్‌, ఆమ్రేపై నిషేధం

DC VS RR: Rishabh Pant, Pravin Amre, Shardul Thakur Fined For Breach Of IPL Code Of Conduct - Sakshi

DC VS RR: రాజస్థాన్‌ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 22) జరిగిన హై ఓల్టేజీ సమరంలో నో బాల్‌ విషయంలో అంపైర్‌ నిర్ణయాన్ని వ్యతిరేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ చేసిన అనవసర రాద్ధాంతానికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. అంపైర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా ఫీల్డ్‌లో ఉన్న ఆటగాళ్లను రీకాల్‌ చేయడంపై కన్నెర్ర చేసిన ఐపీఎల్‌ యాజమాన్యం.. పంత్‌తో పాటు అతనికి మద్దతుగా నిలిచిన శార్దూల్ ఠాకూర్, అసిస్టెంట్ కోచ్‌ ప్రవీణ్ ఆమ్రేలపై చర్యలు తీసుకుంది. 

ఈ మ్యాచ్‌ కోసం రిషబ్ పంత్‌కు లభించే మ్యాచ్‌ ఫీజు మొత్తంపై 100 శాతం కోత విధించగా, శార్దూల్ ఠాకూర్‌కు 50 శాతం జరిమానా పడింది. మ్యాచ్‌ మధ్యలో ఫీల్డ్‌లోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగినందుకు గాను ప్రవీణ్ ఆమ్రేపై 100 శాతం జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం విధించింది. ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ను అతిక్రమించినందుకు గాను ఈ ముగ్గురిపై చర్యలు తీసుకున్నట్లు మ్యాచ్‌ రిఫరి డేనియల్‌ మనోహర్‌ వెల్లడించాడు. 

కాగా, రాజస్థాన్‌ నిర్ధేశించిన 223 పరుగుల ఛేదనలో ఢిల్లీ గెలుపుకు 3 బంతుల్లో 18 పరుగులు అవసరమైన సందర్భంలో నో బాల్‌ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. మెక్‌ కాయ్‌ వేసిన ఓ బంతి నడుం కంటే ఎత్తుకు వెళ్లినప్పటికీ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ నో బాల్‌గా ప్రకటించకపోవడంతో ఢిల్లీ బృంద సభ్యులు ఓవరాక్షన్‌ చేశారు. అంపైర్‌ నిర్ణయం పట్ల అసహనానికి గురైన డీసీ సారధి డగౌట్‌లో నుంచి తమ ఆటగాళ్లను వెనక్కు రావల్సిందిగా సైగలు చేయగా, శార్ధూల్‌ అతనికి మద్ధతుగా నిలిచాడు. ఇదే సమయంలో మ్యాచ్‌కు అంతరాయం కలిగిస్తూ మైదానంలోకి వెళ్లిన ఆమ్రే అంపైర్‌తో వాగ్విదానికి దిగాడు. 
చదవండి: కెప్టెన్‌ పిలిస్తే ఊపుకుంటూ వెళ్లడమేనా.. కుల్దీప్‌ను మెడపట్టి తోసిన చహల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top