ఇదెక్కడి బాదుడురా సామీ.. 10 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 140 పరుగులు | Sakshi
Sakshi News home page

ఇదెక్కడి బాదుడురా సామీ.. 10 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 140 పరుగులు

Published Mon, Jan 22 2024 4:16 PM

BBL 2023 24: Brisbane Heat Josh Brown Smashes 140 Runs In 57 Balls Vs Adelaide Strikers - Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా అడిలైడ్‌ స్ట్రయికర్స్‌తో ఇవాళ (జనవరి 22) జరుగుతున్న నాకౌట్‌ (ఛాలెంజర్‌) మ్యాచ్‌లో బ్రిస్బేన్‌ హీట్‌ ఓపెనర్‌ జోష్‌ బ్రౌన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 57 బంతుల్లోనే 10 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 140 పరుగులు బాదాడు. తొలి బంతి నుంచే శివాలెత్తిన బ్రౌన్‌.. బిగ్‌బాష్‌ లీగ్‌లో రెండో వేగవంతమైన సెంచరీని (41 బంతుల్లో) నమోదు చేశాడు. బ్రౌన్‌ విధ్వంసం ధాటికి ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్‌ హిట్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.

బ్రిస్బేన్‌ ఇన్నింగ్స్‌లో బ్రౌన్‌, కెప్టెన్‌ నాథన్‌ మెక్‌ స్వీని (33) మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోర్‌ చేయలేకపోయారు. చార్లీ వాకిమ్‌ 7, మ్యాట్‌ రెన్‌షా 6, మ్యాక్స్‌ బ్రయాంట్‌ 9, పాల్‌ వాల్టర్‌ 0, జిమ్మీ పియర్సన్‌ 4 పరుగులు చేయగా.. మైఖేల్‌ నెసర్‌ 6, జేవియర్‌ బార్ట్‌లెట్‌ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ బౌలర్లలో డేవిడ్‌ పేన్‌, బాయ్స్‌, లాయిడ్‌ పోప్‌ తలో రెండు వికెట్లు.. థామ్టన్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. 

కాగా, బిగ్‌బాష్‌ లీగ్‌ 2023-24 ఎడిషన్‌ చివరి అంకానికి చేరింది. ఈ మ్యాచ్‌తో ప్రస్తుత ఎడిషన్‌ రెండో ఫైనలిస్ట్‌ ఎవరో తేలిపోతారు. బ్రిస్బేన్‌ హీట్‌, అడిలైడ్‌ స్ట్రయికర్స్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్‌తో తలపడేందుకు అర్హత సాధిస్తుంది. సిడ్నీ సిక్సర్స్‌ క్వాలిఫయర్‌లో విజయం సాధించి, ఫైనల్‌ బెర్త్‌ సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. జనవరి 24న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement