మురుగుకు స్వస్తి.. శుద్ధీకరణకు కుస్తీ
మురికి నీటి ప్రవాహానికి ప్రత్యేక కెనాల్
వారం రోజుల్లో సర్వే పూర్తి
గుర్రపు డెక్కకు శాశ్వత చెక్
గుర్రపుడెక్కతో నర్సాపూర్ చెరువు
సిద్దిపేటజోన్: బల్దియాను పట్టిపీడిస్తున్న గుర్రపు డెక్క, కలుషితమైన చెరువుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ కింద ఎర్ర చెరువు, నర్సాపూర్ చెరువులను ఎంపిక చేసింది. అందుకు అనుగుణంగా ఒక్కో చెరువుకు రూ.3కోట్ల16లక్షల చొప్పున రూ.6 కోట్ల 32లక్షలు మంజూరు చేసింది. ప్రస్తుతం చెరువులకు సంబంధించిన సర్వే ప్రక్రియ సాగుతోంది. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి అనంతరం పనులు మొదలుకానున్నాయి. దీంతో భవిష్యత్తులో చెరువుల్లో గుర్రపు డెక్క సమస్య లేకుండా పర్యాటక ప్రాంతంగా, ఆహ్లాదకరమైన వాతావరణం ముంగిట్లోకి రానుంది.
జిల్లాలో ఏకై క స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేట. బల్దియా రికార్డుల ప్రకారం 1.67లక్షల జనాభా ఉంది. కొనేళ్ల క్రితమే ఆయా నివాసాలకు సంబంధించిన మురుగు నీటిని అండర్ గ్రౌండ్ వ్యవస్థ (యూజీడీ) ద్వారా తరలించి రెండు మురికి నీటి శుద్ధీకరణ ప్లాంట్ లకు అనుసంధానం చేశారు. పట్టణంలో పూర్తి స్థాయిలో యూజీడీ అమలుకు నోచుకోలేదు. దీంతో మురికి నీరు, వరదనీరు కాల్వల ద్వారా పట్టణ శివార్లలోని ఎర్ర చెరువు, నర్సాపూర్ చెరువుల్లో కలుస్తోంది. ఈ క్రమంలో మురికి నీటితో చెరువులు కలుషితమవుతున్నాయి.
శుద్ధీకరణే లక్ష్యంగా..
కేంద్ర ప్రభుత్వ నిధులతో చెరువుల శుద్ధీకరణ, సుందరీకరణకు బల్దియా ప్రతిపాదనలను రూపకల్పన చేసింది. చెరువుల్లోకి మురుగు నీరు రాకుండా శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మురికి నీటిని చెరువుల్లో విలీనం కాకుండా మళ్లింపు ప్రక్రియ జరగనుంది.
కొనసాగుతున్న సర్వే
ఎర్ర చెరువు, నర్సాపూర్ చెరువు విస్తీర్ణం, మురికి నీటి విలీన ప్రాంతాలు, డైవర్షన్ కెనాల్ నిర్మాణాలు, ఎస్టీపీకి అనుసంధానంగా ప్రత్యేక కెనాల్ ఏర్పాటు తదితర అంశాలపై సర్వే సాగుతోంది. రెండు చెరువుల సమీపంలో ఉన్న మురికి నీటి శుద్ధీకరణ ప్లాంట్, చెరువుల స్థితిగతులను అధికారులు పరిశీలించారు. మరో వారం రోజుల్లో సర్వే పూర్తి చేసేలా యంత్రాంగం నిమగ్నమైంది.
రూ.6.32కోట్లతోచెరువుల సుందరీకరణ


