
వానాకాలం జరభద్రం
హుస్నాబాద్: పట్టణ ప్రజలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ పిలుపునిచ్చారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా 5వ వార్డులో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో టైర్లు, పాత కుండల్లో ఉన్న నీటిని పార బోశారు. ఇంటింటికీ తిరుగుతూ సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. 9వ వార్డులో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ వానాకాలం దృష్ట్యా ఇంటిలో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించు కోవాలన్నారు. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎల్లం, పర్యావరణ అధికారి రవి కుమార్, వార్డు అధికారులు, మెప్మా రిసోర్స్‌పర్సన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్