
కల్యాణలక్ష్మికి ‘గెజిటెడ్’ గ్రహణం
● సంతకాలు చేసేందుకు గెజిటెడ్ అధికారుల నిరాసక్తత ● కార్యాలయాల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు
మిరుదొడ్డి(దుబ్బాక): కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తులు చేసుకుంటున్న లబ్ధిదారులకు ఆదిలోనే హంసపాదెదురవుతోంది. అన్ని అర్హతలు కలిగిన పత్రాలను సమకూర్చినప్పటికీ వాటిని ధ్రువపర్చి సంతకాలు చేయాల్సిన గెజిటెడ్ అధికారులు ససేమిరా అంటున్నారు. దీంతో లబ్ధిదారులు నిరాశా నిస్పృహాలకు గురవుతున్నామని కల్యాణ లక్ష్మి బాధితుఉలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన మొగుళ్ళ ఐలవ్వ, మొగుళ్ల లక్ష్మి, భూపల్లి పద్మలు తమ తమ కూతుళ్లకు గత ఐదు నెలల క్రితం వివాహాలు జరిపించారు. కల్యాణ లక్ష్మి పథకం కోసం దరఖాస్తులు చేసుకుందామంటే గెజిటెడ్ అధికారులు సంతకాలు పెట్టకుండా తిప్పుకుంటున్నారని వాపోతున్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలన జరిపాక అర్హులుగా గుర్తించి సంతకాలు చేయాల్సిన గెజిటెడ్ అధికారులు ససేమిరా అంటుండటంతో నిత్యం కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నామని బాధితులు వాపోతున్నారు. కాగా జిల్లాలో కొన్ని సందర్భాల్లో కల్యాణ లక్ష్మి పథకాన్ని పక్కదారి పట్టించడంతో పలువురిపై కేసులు నయోదైనట్లు గుర్తించిన అధికారులు ధ్రువ పత్రాలపై సంతకాలు చేయడానికి గెజిటెడ్ అధికారులు వెనకంజ వేస్తున్నట్లు సమాచారం.