
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
గజ్వేల్: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 2, 13వార్డుల్లో లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గానికి ప్రభుత్వం 3వేల ఇళ్లు మంజూరుచేసిందని చెప్పారు. ఇప్పటికే 2,938మందికి ప్రొసీడింగ్‌లను సైతం అందజేశామన్నారు. నియోజకవర్గానికి అదనపు ఇళ్లు కావాలన్నా.. ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుముఖంగా ఉన్నారన్నారు. ప్రస్తుతం మంజూరైన ఇళ్లను ఆరు నెలల్లో పూర్తి చేసి పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు పూర్తి చేయాలని కోరారు. ప్రజాప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా పక్కా ప్రణాళికతో ముందుకుసాగుతున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లల్లా భావించి సీఎం రేవంత్‌రెడ్డి ముందుకుసాగుతున్నారని కొనియాడారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 9రోజుల్లో 9వేల కోట్లు రైతు భరోసా నిధులను జమ చేసినట్లు చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసీ ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్‌ఖాన్, కాంగ్రెస్ నాయకులు సమీర్ పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
గజ్వేల్‌లో ఇళ్ల పనులు ప్రారంభం