
హుస్నాబాద్‌లో నేడు మంత్రుల పర్యటన
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
హుస్నాబాద్: పట్టణంలో శుక్రవారం నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఏర్పాట్లను గురువారం కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్‌తో కలిసి క్షేత్ర స్ధాయిలో పరిశీలించారు. ఉదయం 11.30 గంటలకు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో రూ.11.50 కోట్లతో నిర్మించిన 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఇదే ప్రాంగణంలో ఉన్న 100 పడకల ఆస్పత్రిని 250 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు రూ.82 కోట్లతో నిర్మించనున్న 150 పడకల భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి వరకు రూ.77.20 కోట్లతో నిర్మిస్తున్న నాలుగు లేన్ల రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగే సమావేశంలో మంత్రులు పాల్గొంటారు.