
క్షయ నిర్మూలనే లక్ష్యం కావాలి
● కలెక్టర్ హైమావతి
● వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష
సిద్దిపేటరూరల్: క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యంగా వైద్యాధికారులు కృషి చేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. ఇందుకు టీబీ పరీక్షల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు అందిస్తున్న వివిధ ఆరోగ్య సేవలపై బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అన్ని ప్రాథమిక కేంద్రాల్లో టీబీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మాతా, శిశు సంరక్షణ కార్యక్రమంలో భాగంగా, గర్భిణుల నమోదు దగ్గర నుంచి ప్రసవం అయ్యేవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన ఎప్పటికప్పుడు వైద్యాధికారులు సమీక్షలు నిర్వహించుకోవాలన్నారు. సంవత్సర కాలంలో జరిగిన శిశు మరణాలపై పూర్తి నివేదికను అందించాలని ఆదేశించారు. ఆయుష్మాన్ ఆరోగ్య సెంటర్‌లో ఓపీ సంఖ్య పెంచాలన్నారు. అలాగే వానాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ పల్వన్ కుమార్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డాక్టర్ శాంత, ప్రభు త్వ గజ్వేల్ ఆస్పత్రి డాక్టర్ అన్నపూర్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.
బాగా చదివి
ప్రజలకు సేవ చేయండి
సిద్దిపేటకమాన్: బాగా చదివి ప్రజలకు సేవ చేయాలని కలెక్టర్ హైమావతి వైద్య విద్యార్థులకు సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. వైద్య కళాశాలలో సిబ్బంది, వైద్య కోర్సుల వివరాలు, అవసరమైన పరికరాలు, ప్రాక్టికల్స్ చేయడానికి ల్యాబ్‌లు, సెక్యూరిటీ తదితర వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వైద్య విద్యార్థులతో మాట్లాడారు. జూనియర్లను ర్యాగింగ్ చేయరాదని సీనియర్ విద్యార్థులకు సూచించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలపై ఆరా తీశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శాంతి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చందర్ తదితరులు పాల్గొన్నారు.