
అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య
మిరుదొడ్డి(దుబ్బాక): అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చదువులో ప్రతీ విద్యార్థి ముందంజలో ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. ‘మన ఊరు – మన బడి’కార్యక్రమంలో భాగంగా అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలకు మంజూరైన డ్యూయల్ డెస్కులను బుధవారం ఆయన ప్రారంభించారు. స్కూల్ యూనిఫామ్స్‌ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే క్రమశిక్షణను అలవర్చుకుంటేనే భవిష్యత్తుకు బాటలు పడతాయన్నారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితేనే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి అంజాగౌడ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్‌పర్సన్ గౌతమి, ప్రధానోపాధ్యాయుడు కిషన్, ఉపాధ్యాయులు పెరుమాండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.