పారిశ్రామిక ప్రగతికి బాటలు | - | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక ప్రగతికి బాటలు

Oct 3 2023 5:16 AM | Updated on Oct 3 2023 5:16 AM

- - Sakshi

సిద్దిపేటజోన్‌: జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరుతోంది. తమ సొంత గడ్డనుంచే రైలు ఎక్కే సమయం ఆసన్నమైంది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న రైలు ప్రయాణానికి ముహూర్తం ఖరారైంది. మంగళవారం మధ్యాహ్నం 3 నిమిషాలకు రైలు కూత వినిపించనుంది. మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఇప్పటికే స్పీడ్‌ టెస్ట్‌, ట్రయల్‌ రన్‌ వంటి ప్రక్రియను పూర్తిచేసిన దక్షిణ మధ్య రైల్వే కీలక ఘట్టానికి పచ్చ జెండా ఉపనుంది. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌ వరకు రోజూ రెండు ట్రిప్పుల ప్యాసింజర్‌ రైలు సేవలు అందనున్నాయి. త్వరలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు సైతం అందుబాటులోకి రానున్నాయి. స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

రూ.1,160 కోట్లతో..

మనోహరాబాద్‌–కొత్తపల్లి రైల్వేలైన్‌ మేడ్చల్‌, సిద్దిపేట, రాజన్న –సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాలకు అనుసంధానంగా ఉంది ఈ మార్గం. అందుకు 151.04 కిలోమీటర్ల రైల్వే మార్గం కోసం రూ.1,160కోట్ల అంచనాతో బడ్జెట్‌ రూపకల్పన చేసి పనులు ప్రారంభించి పూర్తి చేశారు.

116 కిలోమీటర్లు..

సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌ వరకు రైలు మార్గం మొత్తం 116 కిలోమీటర్లు. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌ వరకు ఫుష్‌(డీజిల్‌)రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. సిద్దిపేట, దుద్దెడ, లకుడారం, కొడకండ్ల, గజ్వేల్‌, బేగంపేట, నాచారం, మనోహరాబాద్‌, మేడ్చల్‌, గుండ్ల పోచంపల్లి, బొల్లారం, కేవలరి బ్యారెక్‌,మల్కాజిగిరి, కాచిగూడ వరకు, ఈ మార్గమధ్యలో సిద్దిపేట, గజ్వేల్‌ పట్టణాల్లో రెండు

రైల్వే క్రాసింగ్‌ పాయింట్‌ లను ఏర్పాటు చేశారు. కొమురవెళ్లి, నాచారం ఆలయాలకు జంట నగరాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండనుంది.

సిద్దిపేట రైల్వే స్టేషన్‌లో స్థానికుల ఆనందహేల

రైలు రాకపోకల వివరాలు

మార్గం ప్రారంభం చేరే సమయం సిద్దిపేట–సికింద్రాబాద్‌ ఉ. 06–45 ఉ. 10–45

మ.2–05 సా.5–10

సికింద్రాబాద్‌–సిద్దిపేట ఉ. 10–35 మ.1–45

సా.5–45 రా.8–40

సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు చార్జి రూ.60

ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్‌: రైలు రాకతో గజ్వేల్‌ ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందడానికి బాటలు పడనున్నాయని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎఫ్‌డీసీ) చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం రైలు సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గజ్వేల్‌లో ఇప్పటికే రేక్‌ పాయింట్‌ ఏర్పాటు చేసిన గూడ్స్‌ రైలు సేవలను గుర్తు చేశారు. సాధారణ ప్యాసింజర్‌ రైలు సేవలతో ప్రజలకు మరింత మేలు కలగనున్నదన్నారు. సమావేశంలో మాదాసు శ్రీనివాస్‌, రాజమౌళి పాల్గొన్నారు.

స్వరాష్ట్రంలో ముమ్మరంగా..

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ రైల్వేలైన్‌ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపారు. రూ.వెయ్యి కోట్లు వెచ్చించడం, వసతుల కల్పన, నిరంతర పర్యవేక్షణ వల్ల రైల్వే లైన్‌ మార్గం సుగమమైంది. సిద్దిపేట ప్రజలకు రైలు సౌకర్యం కల్పించండం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఇక్కడి నుంచే తిరుపతి, బెంగళూరు నగరాలకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.

–హరీశ్‌రావు, మంత్రి

ఘన స్వాగతం పలుకుదాం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ప్రధాని మోదీ సిద్దిపేట–సికింద్రాబాద్‌ రైలును జెండా ఊపి వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైలుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకాలన్నారు. సిద్దిపేటలో దుబ్బాక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేయనున్నట్లు తెలిపారు. దుద్దెడలో, లకుడారంలో, కొడకండ్లలో, గజ్వేల్‌లో పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం చెబుతారని తెలిపారు. మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి చెందుతోందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

నాటి నుంచి ఎన్నికల నినాదం

సిద్దిపేటకు రైలు.. అరవై ఏళ్ల కల. ప్రతిసారి పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో పార్టీల ప్రధాన ఆయుధం ఇదే. నాటి వెంకటస్వామి నుంచి మొదలు నంది ఎల్లయ్య, సర్వే సత్యనారాయణ, మల్యాల రాజయ్య, జి, విజయరామరావు వరకు ఇదే నినాదాన్ని చేతపట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైల్వే పనుల మార్గం సుగమమైంది. 2019 లో అప్పట్లో రూపకల్పన చేసిన ప్రాజెక్టులో కొన్ని మార్పులు చేస్తూ మనోహరాబాద్‌–కొత్తపల్లి నూతన రైల్వే ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే అధికారులు చేపట్టారు. గజ్వేల్‌ నుంచి సిద్దిపేట వరకు పనులు కొంత కాలంగా వేగవంతం చేసి ఎట్టకేలకు పూర్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement