
రంగనాయక సాగర్‌కు హైకోర్టు న్యాయమూర్తి
చిన్నకోడూరు(సిద్దిపేట): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పి.శ్రీసుధా ఆదివారం మండలంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద గల అతిథి గృహానికి విశ్రాంతి కోసం వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మనుచౌదరి మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు వెళ్లిన న్యాయయూర్తి శ్రీసుధా తిరుగు ప్రయాణంలో రంగనాయక సాగర్ అతిథి గృహంలో భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో న్యాయ విషయాల గురించి కాసేపు చర్చించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి, ఆర్డీఓ సదానందం, ఏసీపీ మధు, న్యాయవాదులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
23న జహీరాబాద్‌కు
ముఖ్యమంత్రి రాక!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ వారంలో సంగారెడ్డి జిల్లాలో పర్యటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం ఈనెల 23న సాయంత్రం 4 గంటలకు జిల్లాకు వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జిల్లాలో తొలిసారి అధికారికంగా పర్యటించనున్నారు. ఇటీవల సంగారెడ్డిలోని రాంమందిర్ వద్ద జరిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూతురు వివాహ నిశ్చితార్థానికి రేవంత్‌రెడ్డి హజరైన విషయం విదితమే. నిమ్జ్ (జాతీయ ఉత్పాదక, పెట్టుబడుల మండలి)లో నిర్మించిన రోడ్డును సీఎం ప్రారంభించనున్నారు. అలాగే జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇతర అభివృద్ధి పనులను కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అధికారులు చెబుతున్నారు. సీఎం జిల్లా పర్యటన సందర్భంగా జహీరాబాద్ లో బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ సభకు సుమారు 30 వేల మందిని తరలించాలని భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సీఎం పర్యటన షెడ్యూల్ త్వరలో అధికారికంగా ఖరారయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
‘మెపా’ రాష్ట్ర
ఉపాధ్యక్షుడిగా యాదగిరి
వర్గల్(గజ్వేల్): ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (మెపా) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వర్గల్ మండలం మీనాజీపేటకు చెందిన దుండిగల్ యాదగిరి నియమితులయ్యారు. మండలంలో సీఆర్‌పీగా పనిచేస్తున్న యాదగిరి ప్రస్తుతం సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా కొనసాగుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశంలో తనను ‘మెపా’ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియామకం చేసినట్లు యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముదిరాజ్‌ల ఐక్యత, అభివృద్ధి కోసం శక్తివంచనలేకుండా కృషి చేస్తానని అన్నారు.
వ్రత శోభితం..
భక్తజన సందోహం
వర్గల్(గజ్వేల్): ప్రసిద్ధమైన నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు, వారాంతపు సెలవు కలిసి రావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలాచరించారు. సత్యనారాయణస్వామి వ్రతాలు, నృసింహుని కల్యాణం, నిజాభిషేకాలు జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని తరించారు. క్షేత్రంలో 20 సత్యనారాయణ వ్రతాలు, 16 కల్యాణాలు, 10 అభిషేకాలు జరిగినట్లు ఆలయ పర్యవేక్షకులు సుధాకర్‌గౌడ్ తెలిపారు.

రంగనాయక సాగర్‌కు హైకోర్టు న్యాయమూర్తి