
మురికికాల్వను శుభ్రం చేస్తున్న కార్మికులు
మూడు నెలలుగా మల్టీపర్పస్ కార్మికుల ఎదురుచూపులు
సిద్దిపేటఅర్బన్: గ్రామ పంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా జీతాలు రావడం లేదు. దీంతో వారు అప్పు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో వీధులు శుభ్రపరచడం, మురికి కాలువలు తీయడం, డ్రైవర్, ఎలక్ట్రీషియన్, నర్సరీలో మొక్కలు పెంచడం, గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు చేరవేయటం, చెత్తను సెగ్రిగేట్ చేయడం వంటి పనులను మల్టీ పర్పస్ కార్మికులు చేస్తున్నారు. జీతం కింద ఒకొక్కరికి నెలకు రూ.8500 చెల్లిస్తున్నారు. అది కూడా సక్రమంగా రావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 2500 వేల మంది కార్మికులు
జిల్లాలోని 399 గ్రామ పంచాయతీల పరిధిలో 2500 మంది కార్మికులు రోజు వారీగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో కొంత మందికి 2, 3 నెలల బకాయిలు ఉండగా, మరి కొంతమందికి నాలుగు, ఐదు నెలలుగా జీతాలు బకాయి ఉన్నాయి. మొత్తంగా వారికి రూ.1.5 కోట్లు చెల్లించాల్సి ఉంది. గ్రామ పంచాయతీ కార్మికులు ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టంచేస్తే వారికి చెల్లించే జీతాలు అరకొరగా ఉండడంతో కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో తెలియక సతమతమవుతున్నారు.
కనీస సౌకర్యాలు కరువు
జిల్లాలో కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా లేవు. ఇతర జిల్లాలో కార్మికులకు సంవత్సరానికి రెండు పర్యాయాలు రెండు జతల యూనిఫామ్స్, మాస్కులు, సబ్బులు, నూనె తదితర వస్తువులు అందిస్తుంటే, అందుకు భిన్నంగా జిల్లాలో పరిస్థితి ఉందని కార్మికులు ఆరోపిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల వేధింపులు ఎక్కువయ్యాయని, ప్రశ్నిస్తే పనిలో నుంచి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టరేట్ వద్ద ఎన్నిసార్లు ధర్నా చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. ఇప్పటికై నా సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని కార్మికులు హెచ్చరిస్తున్నారు.
మూడు నెలల జీతం రావాలి
నాకు ఐదు నెలల జీతం పెండింగ్‌లో ఉండగా, నవంబర్, డిసెంబర్ నెలకు సంబంధించిన జీతం అకౌంట్‌లో వేశారు. ఇంకా మూడు నెలల జీతం పెండింగ్‌లో ఉంది. శానిటేషన్ మంచిగా ఉండాలి..ట్యాక్స్ కలెక్షన్లు సరిగ్గా చేయాలని టార్గెట్ పెడతారు కానీ కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదు.
–కొత్తపల్లి యాదయ్య, ఎన్సాన్‌పల్లికారోబార్
కనీస సౌకర్యాలు కల్పించాలి
పంచాయతీ కార్మికులకు కనీస సౌకర్యాలు లేవు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో పోరాడి సాధించుకున్న జీఓలు స్వరాష్ట్రంలో అమలు చేయడం లేదు. బకాయి వేతనాల కోసం ఈ మధ్యే ఒక రోజు నిరసన తెలిపాం. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన బాట పడతాం.
–తునికి మహేష్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదరి్శ
పీఎంఎఫ్‌ఎస్‌కు మార్పు వల్లే జాప్యం
కార్మికులు జీతం డబ్బులు పడే అకౌంట్లు ఐఎంఎఫ్ నుంచి పీఎంఎఫ్‌ఎస్‌కు మారుతున్నందు వల్లే ఆలస్యం అయ్యాయి. గత నెల వరకు సంబంధించిన జీతాలు చాలా వరకు చెల్లింపు చేశాం. ఇంకా ఎవరికై నా ఇతర కారణాల వల్ల జీతం పడని వారు నా దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కరించి జీతాలు చెల్లిస్తాం.
– దేవకీదేవి, డీపీఓ


