
ఇందిరానగర్ పాఠశాల నుంచి పదోతరగతి పరీక్ష రాసే విద్యార్థులు వీరే
ఇందిరానగర్ జెడ్పీహెచ్‌ఎస్ నుంచి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య
సాక్షి, సిద్దిపేట: ఆ స్కూల్ నుంచి ఈ ఏడాది పదోతరగతి వార్షిక పరీక్షలకు 253 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అదేదో కార్పొరేట్ స్కూల్ అనుకుంటున్నారా కానే కాదు. అది సిద్దిపేట జిల్లాకేంద్రంలోని ఇందిరానగర్ జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల. ఈ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 1,232 మంది విద్యార్థులు చదువుతున్నారు. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఈ పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పించడంతోపాటు కార్పొరేట్‌స్థాయి విద్య అందిస్తున్నారు.
ఇది 32వ బ్యాచ్
ఇందిరానగర్ పాఠశాల 1982 సంవత్సరంలో ప్రారంభించారు. అప్‌గ్రేడ్ అవుతూ 1991 నాటికి ఉన్నత పాఠశాలగా మారింది. ఆ ఏడాది తొలిసారిగా పదోతరగతి విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 2022–2023 సంవత్సరంలో 253 మంది విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్ రాస్తుండగా, వారిలో బాలురు 131, బాలికలు 122 మంది ఉన్నారు. గతేడాది 238 మంది పరీక్షలు రాయగా 100శాతం ఉత్తీర్ణత సాధించారు. అదే జోష్‌తో ఈఏడు సైతం 100శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. వారికి కేసీఆర్ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ మంత్రి హరీశ్‌రావు అందించారు. సిద్దిపేట జిల్లాలో అయితే 253 మంది విద్యార్థులు ఒకే ప్రభుత్వ పాఠశాల నుంచి పదో తరగతి పరీక్షలు రాయటం ఇదే మొదటిసారి అని జిల్లా విద్యాశాఖ అధికారులు అంటున్నారు.
అడ్మిషన్లు దొరకడమే కష్టం
కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వ పాఠశాలలో అందిస్తుండటంతో ఆ పాఠశాలలో అడ్మిషన్ దొరకడమే కష్టంగా ఉంటుంది. ప్రతీ సంవత్సరం అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరించి విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. డిజిటల్ (స్మార్ట్) క్లాస్‌రూం, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్, లైబ్రరీ, ఆడిటోరియం, సోలార్ ప్లాంట్, యోగా తరగతులు, ఇంగ్లిష్ మాట్లాడే విధంగా ప్రత్యేక శిక్షణ, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, ఎస్‌ఎమ్‌సీ కమిటీ సమావేశాలు, రోబోటిక్స్, ప్రపంచ పరిజ్ఞానం విద్యార్థులకు తెలిసేవిధంగా చేయడం, సాంస్కృతిక, క్రీడలు ఏర్పాటు చేస్తుంటారు. దీంతో విద్యార్థుల తల్లితండ్రులు ఈ పాఠశాలలలో చేర్పించేందుకు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు.
గతేడాది 238 మంది..100శాతం ఉత్తీర్ణత
మంత్రి హరీశ్‌రావు చొరవతో సర్కారు బడిలో కార్పొరేట్‌స్థాయి విద్య
అందరి సహకారంతో ముందుకు
విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో ముందుకు వెళ్తున్నాం. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతోనే మా పాఠశాలకు విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ సారి కూడా పదో తరగతిలో 100శాతం ఉత్తీర్ణత మా విద్యార్థులు సాధిస్తారని నమ్మకం ఉంది. ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్‌స్థాయి విద్య మా విద్యార్థులకు అందిస్తున్నాం.
–సత్యనారాయణరెడ్డి, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం
