ఏకగ్రీవాలకు నజరానేది?
కాలపరిమితి ముగిసినా పైసా రాని వైనం మొదటి విడతలో 6 జీపీలకు సింగిల్ నామినేషన్లు
మెదక్‌జోన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నజరానా దశాబ్ద కాలంగా పైసా ఇవ్వలేదు. ఫలితంగా పాలకుల హామీలు ప్రకటనలకే పరిమితం అవుతుండటంతో ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవంపై నిరాసక్తత చూపుతున్నారు.
మెదక్ జిల్లాలో 2019లో 469 గ్రామాలు ఉండగా అప్పట్లో 82 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించకుండా ఏకగ్రీవం చేశారు. ఈ యునానిమస్ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల నజరానా ఇవ్వనున్నట్లు నేతలు పేర్కొనటంతో గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా అప్పట్లో పోటీపడి ఏకగ్రీవం చేశారు. కాలపరిమితి ముగిసినా ఆ పల్లెల అభివృద్ధికి ఇవ్వాల్సిన నజరానా రాకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో 2019 ఎన్నికల సమయంలో 82 గ్రామాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం ప్రకటన ప్రకారం ఏకగ్రీవమైనా ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున మొత్తం 82 గ్రామాలకు రూ. 8.20 కోట్లు అభివృద్ధి కోసం రావాల్సి ఉండగా, ప్రభుత్వం చేతులెత్తేసింది. ఏకగ్రీవమైన మండలాల్లో అత్యధికంగా పాపన్నపేట మండలంలో 12 పంచాయతీలు ఏకగ్రీవం కాగా రెండవ స్థానంలో నర్సాపూర్, కౌడిపల్లి మండలాల పరిధిలో 10 గ్రామాల చొప్పున ఏకగ్రీవమయ్యాయి. శివ్వంపేట మండలంలో 8, హవేళిఘనాపూర్, చిన్నశంకరంపేట మండలాల్లో 7 చొప్పున పెద్దశంకరంపేట, టేక్మాల్ మండలాల్లో 5 చొప్పున మెదక్, చిలిపిచెడ్, చేగుంట రామాయంపేట తదితర మండలాల పరిధిలో మొత్తం 82 గ్రామాలను ఏకగ్రీవం చేశారు.
ఆసక్తి చూపని వైనం
పరిపాలన సౌలభ్యం కోసం మెదక్‌ను 2016లో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. అనంతరం 500 జనాభాగల గిరిజన తండాలతో పాటు మధిర గ్రామాలను సైతం పంచాయతీలుగా ఏర్పాటు చేయటంతో జిల్లాలో జీపీల సంఖ్య 492కు చేరుకోవటంతో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మొదటి విడతలో 6 మండలాల పరిధిలో 160 గ్రామాల నుంచి నామినేషన్లు వేయగా డిసెంబర్ 3వ తేదీ వరకు నామినేషన్లు విత్‌డ్రాలకు అవకాశం ఉంది. కానీ కేవలం ఆరు గ్రామాలకు మాత్రమే సింగిల్ నామినేషన్లు వచ్చాయి. అవి మాత్రమే ఏకగ్రీవమయ్యే పరిస్థితి ఉంది.
2019లో 82 గ్రామాలు యునానిమస్


