ప్రచారంలో నయా ట్రెండ్
ఏఐ సాయంతో సోషల్ మీడియాలో ప్రచారం
ట్రెండింగ్ పాటలతో వీడియోలు
ఫ్లెక్సీ షాపులకు ఫుల్ గిరాకీ
దుబ్బాకటౌన్: ఒకప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే.. బ్యానర్లు కట్టడం, కరపత్రాలు అందించ డం లాంటి పనులతో ప్రచారం హోరెత్తేది. రోజురోజుకు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం మూలంగా ప్రచార సరళి స్మార్ట్‌గా మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మూలంగా ఫోన్‌లోనే వీడియోలు, ఫ్లెక్సీ షాపులలో పోస్టర్ డిజైనింగ్ రూపొందించి సోషల్ మీడియా గ్రూపులను హోరెత్తిస్తున్నారు.
పాపులర్ పాటతో వాట్సప్ స్టేటస్‌లు
సిద్దిపేట జిల్లాలో సర్పంచ్ అభ్యర్థులు రాజకీయ నాయకులకు పాపులర్ అయిన పాటలతో ఏఐ సహాయంతో వీడియోలు రూపొందించి వాట్సాప్ స్టేటస్ రూపంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు ఇంటింటికీ తిరిగి చేసిన ప్రచారం, ఇప్పుడు సోషల్ మీడియాలో, వాట్సాప్ స్టేటస్‌లో మారుమోగుతుంది. నూతనంగా అందివచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రచార కార్యక్రమంలో అభ్యర్థులకు వరంగా మారింది. దీంతో ప్రచార ఖర్చు కూడా తగ్గనుంది.ఏఐ సహాయంతో ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్స్‌తో తమ ఫొటోలు జోడించి ఎడిట్ చేయించి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో మార్మోగిస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు సోషల్ మీడియా ప్రచారం కోసం ప్రత్యేకంగా టీంను నియమించుకొని వీడియోలు, పోస్టర్లు తయారు చేయించి ఓటర్లకు చేరే విధంగా సోషల్ మీడియాలో గ్రూపులు క్రియేట్ చేసి తమను తాము ప్రచారం చేసుకుంటున్నారు.
స్థానికంలో గెలుపే లక్ష్యంగా స్మార్ట్ వర్క్
ప్రచారంలో నయా ట్రెండ్


