అపరిచిత లింక్‌లు ఓపెన్ చేయొద్దు
సైబర్ మోసాలకు గురికావద్దు
● ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్ అవగాహనలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ మున్సిపాలిటీ: అపరిచిత లింక్‌లు, అనుమానాస్పద మెసేజ్‌లు, తెలియని ఈమెయిల్ అటాచ్‌మెంట్‌లను క్లిక్ చేసి సైబర్ మోసాలకు గురికావద్దని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 150 మంది విద్యార్థులు, 50 మంది సీనియర్ సిటిజ్‌న్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో మోసం చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల డిజిటల్ అరెస్ట్, పోలీసుల పేరుతో బెదిరింపులు, కస్టమ్స్, కొరియర్ మోసాలు, బ్యాంక్ కేవైసీ అప్‌డేట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వ్యక్తిగత సమాచారం బ్యాంక్ ఖాతా వివరాలు ఎవరికీ ఇవ్వొద్దన్నారు. ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కార్యక్రమం 6 వారాల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో మెదక్ అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు సుభాష్ చంద్రబోస్, నరేందర్ గౌడ్, ప్రసన్న కుమార్, డీగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఉస్సేన్, డీగ్రీ కళాశాల అధ్యాపకులు, సీనియర్ సిటిజన్స్, విద్యార్థులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి వాహనం క్షుణ్ణంగా తనిఖీ
హవేళిఘణాపూర్(మెదక్): సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంభోజిపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీల రిజిస్టర్‌ను పరిశీలించి సిబ్బంది వాహన తనిఖీలు చేస్తున్న విధానాన్ని ప్రత్యక్షంగా ఆయన పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే వ్యక్తులపై ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.


