కార్మికుల ఆస్పత్రికి సుస్తీ | - | Sakshi
Sakshi News home page

కార్మికుల ఆస్పత్రికి సుస్తీ

Jul 4 2025 6:47 AM | Updated on Jul 4 2025 6:47 AM

కార్మికుల ఆస్పత్రికి సుస్తీ

కార్మికుల ఆస్పత్రికి సుస్తీ

సమస్యల సుడిగుండంలో డిస్పెన్సరీలు

మందుల జాడ కరువు

బీడీ కార్మికులకు అందని వైద్యం

స్పందించని అధికార యంత్రాంగం

సిద్దిపేటజోన్‌: బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఆస్పత్రులు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం పరిశ్రమలపై ఆధారపడి ఉన్న కార్మికుల సంఖ్య 60వేలు కాగా, అనధికారికంగా వీరికి మూడింతలున్నట్లు వినికిడి. బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల కోసం అనారోగ్య సమస్యలు వస్తే వైద్యం కోసం కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఆస్పత్రులు(డిస్పెన్సరీ)లు ఏర్పాటు చేసింది. అరకొరగా మందులు, సిబ్బంది ఖాళీలు, మూలనపడ్డ అంబులెన్స్‌, గ్రామాల్లో కానరాని వైద్య శిబిరాలు వెరసి కార్మిక వైద్యం గాడితప్పుతోంది.

జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌, నియోజకవర్గ పరిధిలోని అత్యధిక గ్రామాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. ఆయా ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలకు సంబంధించిన కార్ఖానాల్లో జిల్లాలో లక్ష పైచిలుకు మహిళా బీడీ కార్మికులు పనిచేస్తున్నారు. నిత్యం బీడీ చుట్టే క్రమంలో తంబాకు ప్రభావం వల్ల మహిళలు అనారోగ్యం బారినపడే ప్రమాదాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులు క్షయ, దగ్గు దమ్ము, ఆస్తమా లాంటి వాటిన పడి బాధపడుతున్నారు. వీరికి ఉచితంగా వైద్యం అందించే క్రమంలో సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో ఆస్పత్రులు ఏర్పాటు చేశారు.

మందులు, సిబ్బంది కొరత

డిస్పెన్సరీలో అవసరమైన మందులు ఉండటం లేదు. జ్వరం, కీళ్ల నొప్పులు, దగ్గు, లాంటి రోగాల మందులు మాత్రమే ఉన్నాయనే ఆరోపణలున్నాయి. మరోవైపు మందులు ఇచ్చే ఫార్మాసిస్ట్‌ పోస్టుతోపాటు పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏడు పోస్టులకు గాను ముగ్గురు మాత్రమే ఉన్నారు. దీంతో ఇక్కడి వైద్యురాలిపై అదనపు పనిభారం పడుతోంది. దుబ్బాకలోనూ ఇదే పరిస్థితి. ఉన్న వైద్యుడు రెండు రోజుల పాటు డిప్యుటేషన్‌పై ముస్తాబాద్‌ వెళ్లడంతో నాలుగు రోజులే అందుబాటులో ఉంటున్నాడు. ఉన్న ఒక ఫార్మాసిస్ట్‌ సిద్దిపేట నుంచి డిప్యుటేషన్‌ పైవచ్చి పనిచేస్తున్నాడు. పదవీ విరమణ జరుగుతున్న నియామకం లేకపోవడంతో కార్మిక ఆస్పత్రుల్లో ఖాళీల ప్రభావం వైద్యంపై పడుతోంది.

పత్తా లేని వైద్య శిబిరాలు

బీడీ కార్మికులకు మొబైల్‌ వైద్య సేవలు పత్తా లేకుండా పోయాయి. సిద్దిపేట, దుబ్బాక డిస్పెన్సరీ పరిధిలోని గ్రామాల్లో షెడ్యూల్‌ మేరకు అంబులెనన్స్‌ ద్వారా వైద్య సేవలు అందించాలి. కొన్నేళ్లుగా వైద్య శిబిరాల జాడ లేదు. డ్రైవర్‌ పోస్టు ఖాళీగా ఉండటంతో సిద్దిపేట ఆస్పత్రిలో అంబులెన్‌న్స్‌ మూలన పడింది. ఆయా డిస్పెన్సరీల్లో నెలకొన్న సమస్యలపై డాక్టర్‌ లకీ్‌ష్మ్‌ప్రసన్న వివరణ కోరగా.. సిద్దిపేట ఆస్పత్రిలోని సమస్యలను ఉన్నతాధికారులకు నివేదిక అందజేశానని తెలిపారు. నియామకాలు లేకపోవడంతో ఖాళీల సమస్య ఉందన్నారు. పురాతన వాహనం, డ్రైవర్‌ పోస్ట్‌ ఖాళీ వల్ల మొబైల్‌ క్యాంపు ఏర్పాటు సమస్యగా మారిందన్నారు.

సిద్దిపేట పట్టణంలో డిస్పెన్సరీ, ఆస్పత్రిలో ఉన్న మందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement