
చీట్ ఫండ్
డిపాజిట్ చేసి మోసపోయిన బాధితుడు
మెదక్‌జోన్: చిట్‌ఫండ్ కంపెనీల్లో సామాన్యులు డిపాజిట్లు చేసి మోసాలకు గురవుతున్నారు. జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా సమీపంలో కొందరు ఆదర్శ్ క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో చిట్‌ఫండ్ కంపెనీ పెట్టారు. అయితే హవేళిఘనాపూర్ మండలం సర్దన గ్రామానికి చెందిన కటికె షబ్బీర్ 2019లో తన చెల్లెలు నశ్రిన్ పేరుపై ఈ కంపెనీలో రూ.50 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాడు. 10 సంవత్సరాలు అంటే 2029 నాటికి రూ.1,85,361 అవుతుందని నిర్వాహకులు చెప్పడంతో నమ్మాడు. కానీ 2020లో కంపెనీని మూసేసి ఉడాయించారని ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు లబోదిబోమన్నాడు. చిట్‌ఫండ్ మోసాలపై తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి : తపస్
వెల్దుర్తి(తూప్రాన్): జీఓ 317 వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు వెంటనే న్యాయం చేయాలని తపస్ సంఘం రాష్ట్ర కార్యదర్శి దుబాషి భాస్కర్, జిల్లా బాధ్యులు రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సంఘం సభ్యత్వ నమోదు చేపట్టి, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఆర్థిక భారం లేని సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోచయ్య, ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇద్దరు నిందితుల రిమాండ్
నంగునూరు(సిద్దిపేట): పేషీలకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను గురువారం కోర్టులో హాజరు పరచగా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ అసీఫ్ వివరాల మేరకు... నంగునూరు మండలం ఘణపూర్‌కు చెందిన బోడ తిరుపతిరెడ్డిపై 2019లో, అలాగే మద్దూర్ మండలం బెక్కల్‌కు చెందిన ఆరే ఉప్పలయ్యపై రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితులు కోర్టు పేషీలకు హాజరు కాకుండా తిరుగుతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరిని కరీంనగర్‌లోని జిల్లా జైలుకు తరలించారు.
నూతన టెక్నాలజీపై
శిక్షణ ఇవ్వాలి
గజ్వేల్‌రూరల్: ప్రభుత్వం టూ వీలర్ మెకానిక్‌లకు నూతన టెక్నాలజీపై శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలని ఆ సంఘం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఓ గార్డెన్‌లో గజ్వేల్ టూ వీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో కలిసి టూ వీలర్స్ అసోసియేషన్ పతాకం ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్‌కుమార్, రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస్‌రెడ్డి, గజ్వేల్ అధ్యక్షుడు అనిల్, మాజీ అధ్యక్షులు ధన్‌రాజ్ సింగ్, వెంకటేష్, ముఖ్య సలహాదారు నర్సింలు, సభ్యులు పాల్గొన్నారు.
సబ్ రిజిస్ట్రార్‌కు
స్పల్ప గాయాలు
అల్లాదుర్గం(మెదక్): సబ్ రిజిస్ట్రార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామ శివారులో 161 జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. వివరాలు... హైదరాబాద్ మహిదీపట్నంకు చెందిన మహ్మద్ నిజామోద్దిన్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి కారులో వెళ్తుండగా ముస్లాపూర్ వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఆయనకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు.

చీట్ ఫండ్