
పగలు కూలీ.. రాత్రి చోరీ
● నలుగురు నిందితుల అరెస్టు
● పదిరోజుల క్రితం మండల కేంద్రంలో చోరీ
● వివరాలు వెల్లడించిన ఏసీపీ
కొమురవెల్లి(సిద్దిపేట): చోరీ కేసులో నలుగురి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం కొమురవెల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ రాజు, చేర్యాల సీఐ శ్రీనుతో కలిసి హుస్నాబాద్ ఏసీపీ సదానందం వివరాలు వెల్లడించారు. గత నెల 24న మండల కేంద్రంలో పోతుగంటి కొమురెల్లి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు బీరువా పగులగొట్టి 4తులాల బంగారు, 22 తులాల వెండి ఆభరణాలు దొంగిలించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో భాగంగా కొమురవెల్లి గ్రామ శివారులోని ఓ వెంచర్ సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన బిజిలి సురేష్, అంగడి జంపయ్య, దాసరి అశోక్, ముదగాని సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దొంగతనం చేసినట్లు అంగీకరించారు. వారి నుంచి 9 తులాల బంగారం, 22తులాల వెండి ఆభరణాలు, సెల్‌ఫోన్, మూడు ద్విచక్రవాహనాలు, ఒక ఇనుపరాడ్డును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న అనరెడ్డి రవి, కూజ నర్నయ్య పరారీలో ఉన్నారని, గాలిస్తున్నామని తెలిపారు. ఏడాదిగా ఈ ముఠా సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చి హైదరాబాద్ నేరెడ్‌మెట్ ప్రాంతంలోని వినాయకనగర్‌లో ఉంటూ ఉదయం కూలీ పని చేస్తూ రాత్రి చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 18 దొంగతనాలకు పాల్పడ్డారని చెప్పారు. నిందితులపై పలు కేసులున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ రాజు, కానిస్టేబుల్ రమేష్ అభినందించారు.