
రోడ్డు ప్రమాదంలో ఎస్సై దుర్మరణం
కంది మండలం చేర్యాల గేటు వద్ద ఘటన
కంది(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో ఎస్సై దుర్మరణం చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాజేశ్వర్ రావు(54) సంగారెడ్డి పట్టణంలోని చాణిక్యపురి కాలనీలో నివాసం ఉంటున్నాడు. మూడు రోజులుగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విధులు ముగించుకొని బుధవారం రాత్రి సంగారెడ్డికి కారులో బయలు దేరాడు. ఈ క్రమంలో కంది మండలం చేర్యాల గేటు వద్ద జాతీయ రహదారిపై రాజేశ్వర్ కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
ఎస్సై కుటుంబంలో
తీవ్ర విషాదం
ఎస్సై మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతునికి భార్య గాయత్రి తోపాటు ఓ కుమారుడు, కుమార్తె ఉంది. ఆరు నెలల క్రితం ఎస్సైగా ప్రమోషన్ పొందిన రాజేశ్వర్ ఫిలింనగర్‌కు వారం రోజుల క్రితమే బదిలీపై వెళ్లారు. కొత్త పోస్టింగ్‌లో చేరిన కొన్ని రోజులకే ఎస్సై మృతి చెందడం తోటి సిబ్బందిని కలచివేసింది. ఎస్సై అంత్యక్రియల్లో అదనపు ఎస్పీ సంజీవ రావు, డీఎస్పీ సత్తయ్య గౌడ్, సీఐలు క్రాంతి కుమార్, రమేష్, సంతోష్‌తోపాటు రూరల్ ఎస్సై రవీందర్ పాల్గొన్నారు.