
మోటార్ ఆన్ చేస్తుండగా..
విద్యుదాఘాతంతో రైతు మృతి
అక్కన్నపేట(హుస్నాబాద్): విద్యుదాఘాతంతో రైతు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మండలంలోని పంతుల్‌తండా గ్రామ పరిధిలోని దుబ్బతండాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... తండాకు చెందిన భానోతు కిష్టు అలియాస్ కీచు(51)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తనకున్న ఎకరంలో వ్యవసాయం చేస్తూ కూలీ పనులకు పోతుంటారు. కొన్ని రోజులుగా ఇంటి మరమ్మతు పనులు చేయిస్తున్నారు. ఇంటి ఆవరణలో నిర్మించిన సంపులో చిన్న మోటార్‌ను బిగించారు. దానిని ఆన్ చేస్తుండగా షాక్ కొట్టి అక్కడిక్కడే మృతి చెందాడు. కూలీనాలీ చేసుకుంటూ జీవిస్తున్న కుటుంబ పెద్ద దిక్కుగా ఉన్న కిఘ్ఠ మృతి చెందడంతో తండావాసులు రోదిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
మరో ఘటనలో వ్యవసాయ కూలీ..
చిన్నశకరంపేట(మెదక్): విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన నార్సింగి కాస్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ అహ్మద్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన వంజరి నర్సింహులు(32) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి వద్ద పనులు చేసేందుకు జీతం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం పొలం పనులకు వచ్చిన నర్సింహులు బోరు మోటారు స్టార్టర్ వద్ద కరెంటు వైర్లు సరిచేస్తున్న క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. నర్సింహులును గమనించి అదే పొలంలో ట్రాక్టర్ నడుపుతున్న స్వామి ఘటన స్థలం వద్దకు రాగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. ఈ విషయం మృతుడి బంధువులతో పాటు పోలీసులుకు సమాచారం అందించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య వెంకటమమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మోటార్ ఆన్ చేస్తుండగా..