
భూ సమస్యలు పరిష్కరించాలి
కలెక్టర్ క్రాంతి వల్లూరు
కొండాపూర్(సంగారెడ్డి): భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా వచ్చిన భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. కొండాపూర్ మండల పరిధిలోని గొల్లపల్లిలో శుక్రవారం నిర్వహించిన భూభారతి సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రైతులు సమర్పించిన దరఖాస్తులో భూ సమస్యలను పేర్కొనే సమయంలో వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. ఏవైనా సందేహాలుంటే సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించి నివృతి చేసుకోవాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సూచించారు. రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలించారు. అంతకు ముందు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. గొల్లపల్లిలోని పీఏసీఎస్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి,ఆర్డీఓ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ అశోక్‌తో టు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.