
నిత్య నైవేద్యానికి ఆర్థిక సాయం
● ధూప, దీప నైవేద్యానికి దరఖాస్తులు ఆహ్వానించిన ప్రభుత్వం ● ఈ నెల 24 వరకు స్వీకరణ ● ఇప్పటివరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 939 ఆలయాలు ఎంపిక ● ఎంపికై న ఆలయానికి రూ.10 వేలు
సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే పురాతన ఆలయాలతోపాటు నూతనంగా నిర్మించిన ఆలయాలలో నిత్య పూజా కార్యక్రమాలు కొనసాగే విధంగా చర్యలు చేపట్టింది. అందులోభాగంగానే కొన్నేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ధూప, దీప, నైవేద్యం (డీడీఎన్) పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ అమలు చేస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.
నిత్య పూజాది,నైవేద్య కార్యక్రమాలు జరగాలని..
గ్రామాలలోని ప్రతి ఆలయంలో నిత్య పూజా కార్యక్రమాలుతోపాటు నైవేద్య సమర్పణ జరగాలని ప్రధాన ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డా.రాజశేఖర్ రెడ్డి 2007లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లో ఈ పథకం కింద రూ.2,500 మంజూరు చేసేవారు. అనంతరం ఏర్పాటైన అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.10వేలకు పెంచింది. డీడీఎస్ పథకంలో ఎంపికై న ఆలయానికి లభించే రూ.10 వేలలో రూ.4వేలు ధూప, దీప నైవేద్యానికి, రూ.6వేలు ఆలయంలో పూజలు చేసే అర్చకుడికి గౌరవ వేతనంగా అందిస్తున్నారు. ధూప, దీప, నైవేద్య పథకానికి సుమారు మూడేళ్ల తర్వాత ఆలయాల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలో 939 ఆలయాలను ఈ పథకానికి ఎంపిక చేశారు.
43 సెక్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ తప్పనిసరి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డీడీఎన్ పథకానికి దేవాదాయ ధర్మదాయ శాఖ చట్టం ప్రకారం 43సెక్షన్ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలని నిబంధన ఉంది. అదేవిధంగా పథకానికి దరఖాస్తు చేసుకునేవారు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో విధులు నిర్వహించకుండా ఉండాలి. ముఖ్యంగా పురాతన ఆలయాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పథకం కోసం దరఖాస్తు చేసుకునే ఆలయం ఎటువంటి ఆస్తులతో పాటు ఆదాయాలు కలిగి ఉండకూడదని నిబంధన ఉంది. నిర్దేశిత సమయంలో దరఖాస్తు చేసుకుని, దేవాదాయ ధర్మదాయ సహాయ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో పత్రాలను అందించాలి.
ఆలయాల ఎంపికకు కమిటీ
పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వాటిని ఎంపిక చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కమిటీలో జిల్లా అదనపు కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ (దేవాదాయశాఖ), తహసీల్దార్‌తోపాటు ప్రముఖ పూజారి ఉండనున్నారు. వీరి విచారణ అనంతరం రెండవ దశలో మరో ప్రత్యేక కమిటీ పరిశీలించనున్నారు.
ఉమ్మడి మెదక్‌లో ధూప, దీప నైవేద్యం పథకానికి ఇప్పటివరకు మంజూరైన ఆలయాలు
దశ మెదక్ సంగారెడ్డి సిద్దిపేట
మొదటి 43 31 144
రెండవ 43 91 142
మూడవ 93 181 171
మొత్తం 179 303 457
అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం ధూప దీప నైవేద్య పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 24 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆలయానికి ఎలాంటి ఆదాయాలు, ఆస్తులు లేకుండా ఉండి, రిజిస్టర్ అయి తప్పనిసరిగా ఉండాలి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో పర్యటించి నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు.
–చంద్రశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ ధర్మదాయ శాఖ, ఉమ్మడి మెదక్ జిల్లా

నిత్య నైవేద్యానికి ఆర్థిక సాయం