దివ్యాంగులకు సామాజిక భద్రత కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులకు సామాజిక భద్రత కల్పించాలి

May 7 2025 7:34 AM | Updated on May 7 2025 7:34 AM

దివ్యాంగులకు సామాజిక భద్రత కల్పించాలి

దివ్యాంగులకు సామాజిక భద్రత కల్పించాలి

జహీరాబాద్‌ టౌన్‌: దివ్యాంగులకు సామాజిక భద్రత కల్పించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు కొనింటి నర్సింలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో శారీరక దివ్యాంగుల రోస్టర్‌ను మార్చాలని మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. ప్రత్యేకంగా దివ్యాంగులకు కార్పొరేషన్‌ ఏర్పాటుతోపాటు, ప్రత్యేక విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. తీవ్ర వైకల్యం కల్గిన వారికి రూ.25 వేల ప్రత్యేక అలవెన్స్‌ ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13న హైదరాబాద్‌లోని వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వెల్లడించారు.

‘రైల్వేను ప్రైవేటీకరించొద్దు’

జహీరాబాద్‌ టౌన్‌: రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సీఐటీయూ నాయకులు మంగళవారం పట్టణంలోని రైల్వే స్టేషన్‌ వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి మహిపాల్‌ మాట్లాడుతూ...కేంద్రంలోని మోదీ సర్కార్‌ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటీకరిస్తోందన్నారు. ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసి రైల్వేను కూడా ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలని కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. రైల్వే స్టేషన్లలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. జహీరాబాద్‌ స్టేషన్‌లో చేపడుతున్న అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బక్కన్న, లక్ష్మణ్‌, గుండప్ప, మొగులయ్యలు పాల్గొన్నారు.

నీటి ఎద్దడి లేకుండా చూడాలి

జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా

సంగారెడ్డి జోన్‌: గ్రామాలలో వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌ నుంచి పంచాయతీ కార్యదర్శులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఎక్కడా నీటి సమస్య లేకుండా చూడాలన్నారు. తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎక్కడైనా బోరుబావుల మోటార్లు చెడిపోయినా, పైప్‌ లీక్‌ అయినా వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.

ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం

జహీరాబాద్‌ టౌన్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి.రాంచందర్‌ ఆరోపించారు. పట్టణంలోని శ్రామిక్‌ భవనంలో మంగళవారం నిర్వహించిన కార్మిక సంఘం సమావేశంలో రాంచందర్‌ పాల్గొని మాట్లాడారు. ఉపాధిహామీ పథకాన్ని పటిష్టపరిచేందుకు రూ.2 లక్షల కోట్లు కేటాయించాలన్నారు. రోజు కూలీ రూ.600 ఇవ్వాలని, రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, సంవత్సరంలో 200 పనిదినాలు కల్పించాలన్నారు. కొత్త జాబ్‌ కార్డులు ఇవ్వాలని కోరారు. డిమాండ్‌ల సాధన కోసం ఈ నెల 20 జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల సంఘం నాయకులు తుల్జరాం, సంజీవ్‌ కుమార్‌, ఇస్మాయిల్‌ పాల్గొన్నారు.

సమ్మెను జయప్రదం చేయండి

జిన్నారం (పటాన్‌చెరు): బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని రాష్ట్ర కార్మిక నాయకులు వరప్రసాద్‌ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలకు కార్పొరేట్‌ శక్తులకు అప్పగించే మోదీ సర్కార్‌ కుట్రలను తిప్పి కొట్టాలని మే 20 నిర్వహించే దేశవ్యాప్త జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బొల్లారంలో అఖిలపక్ష నాయకులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతాంగ హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. కార్మిక చట్టాలు కోడ్‌లను ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు కొల్కూరి నరసింహారెడ్డి, ఉపాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సీఐటీయూ కార్యవర్గ సభ్యుడు రాజయ్య, స్థానిక కార్మిక నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement