
తెలుగు చిత్ర పరిశ్రమకు 2024లో రూ.3,700 కోట్ల నష్టం
పైరసీ నష్టాలకు బీమా కవరేజ్ కోరుతున్న నిర్మాణ సంస్థలు
బీమా కంపెనీలు ఆసక్తి చూపడం లేదంటున్న సినీ పరిశ్రమ
నష్టాలను లెక్కించడం, నిరూపించడం కష్టమంటున్న కంపెనీలు
⇒ సినిమా పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు గత ఏడాది రూ.3,700 కోట్ల నష్టం వాటిల్లిందని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. ఒక్క తెలుగు సినీ పరిశ్రమకే ఈ స్థాయిలో నష్టం వాటిల్లితే.. మరి దేశవ్యాప్తంగా ఇతర భాషల చిత్రాల సంగతేంటి? పైరసీ నష్టాల నుండి బయటపడేందుకు చిత్ర నిర్మాతలు బీమా రక్షణను కోరుతున్నారు. బీమా సంస్థలు మాత్రం.. నష్టాలను లెక్కించడం, నిరూపించడం కష్టమంటూ బీమా కవరేజ్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు.
⇒ పుష్ప–2, కల్కి 2898 ఏడీ, గేమ్ ఛేంజర్, తండేల్, సింగిల్.. మొన్నటికి మొన్న కన్నప్ప.. ఇలా చెప్పుకుంటూ పోతే పైరసీకి గురైన సినిమాల జాబితా పెద్దదే. ఈ ఏడాది మార్చిలో విడుదలైన సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ చిత్రం లీక్ కావడంతో నిర్మాత రూ.91 కోట్ల నష్టాన్ని చవిచూశారన్న వార్తలు గుప్పుమన్నాయి. చిత్ర పరిశ్రమను పైరసీ భయం వెంటాడుతోంది. ప్రధానంగా పెద్ద బడ్జెట్ చిత్రాల విషయంలో నిర్మాతలు ఆందోళనగా ఉన్నారు. పైరసీ సంబంధ నష్టాల నుండి బయటపడేందుకు చిత్ర నిర్మాతలు బీమా రక్షణను కోరుతున్నారు. అయితే కవరేజ్ విషయంలో బీమా సంస్థలు వెనుకాడుతున్నాయని సినీ పరిశ్రమ చెబుతోంది.
⇒ వ్యవస్థాగత మార్పులతో..: బీమా కవరేజ్‌పై ఆధారపడటం కంటే వ్యవస్థాగత మార్పుల ద్వారా పైరసీని ఎదుర్కోవాలని కొందరు నిర్మాతలు భావిస్తున్నారు. పైరసీ కవర్‌తో నష్టాలను తిరిగి పొందే బదులు కఠిన చట్టాలను తీసుకురావడం ద్వారా పైరసీని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నది వారి ఆలోచన. మరికొందరు మాత్రం పైరసీ కవర్‌తో నష్టం కొంతైనా పూడ్చుకోవచ్చని భావిస్తున్నారు.
⇒ నిధుల సవాళ్లు ఉన్న సమయంలో పైరసీ కవర్ కోసం అదనపు ఖర్చు అనేది నిర్మాతలకు భారమయ్యే వ్యవహారమే. సినీ రంగానికి ‘పరిశ్రమ’ హోదా ఇవ్వడం వల్ల ఈ సమస్యలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చిత్ర నిర్మాతలు పైరసీ ముప్పును పరిష్కరించడానికి ప్రత్యేక బీమా ఉత్పత్తుల కంటే ప్రధానంగా యాంటీ–పైరసీ అమలుపై ఆధారపడుతున్నారు. అంటే కాపీరైట్ కలిగిన కంటెంట్‌ను అనధికారికంగా వినియోగం, పంపిణీని అడ్డుకోవడానికి వ్యూహాలు, చర్యలను అమలు చేస్తున్నారు.
⇒ రెండు ప్రధాన బీమాలు..: మన చలనచిత్ర పరిశ్రమలో ప్రధానంగా రెండు బీమాలు ఉన్నాయి. వీటిలో ఒకటి చిత్ర నిర్మాణం కోసం కాగా, మరొకటి పంపిణీ కోసం. నిర్మాణంలో ఆలస్యం; తారాగణం, సిబ్బంది అనారోగ్యం; పరికరాల నష్టం, ప్రొఫెషనల్ సేవల్లో లోపాలు తప్పులు లేదా నిర్లక్ష్యం కారణంగా క్లయింట్‌కు కలిగే ఆర్థిక నష్టాలకు ‘చలనచిత్ర నిర్మాణ బీమా’ కవరేజీని అందిస్తోంది. ఫిల్మ్ ప్రింట్లు, డిజిటల్ మాస్టర్స్ నష్టం, థియేటర్లలో విడుదల జాప్యం, వ్యాపార అంతరాయాలు, విడుదలకు ముందు లేదా డిజిటల్ విడుదల ప్రారంభ దశలలో లీక్ లేదా పైరసీ నుండి ఉత్పన్నమయ్యే నష్టాల నుండి ‘చలనచిత్ర పంపిణీ బీమా’ రక్షిస్తుంది.
పైరేటెడ్ మూలాల నుండి..
అధిక బడ్జెట్‌తో నిర్మాణాలు చేపట్టే స్టూడియోలు పైరసీ కవర్ కోసం బీమా సంస్థలను సంప్రదిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే కంటెంట్ లీక్ అవుతోందనే భయం నిర్మాతలు, నిర్మాణ సంస్థల్లో పెరుగుతోందని బీమా కంపెనీ ‘అలయన్స్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్’ చెబుతోంది. ‘మీడియా పార్ట్‌నర్స్ ఆసియా’ ఇటీవలి నివేదిక ప్రకారం.. పైరసీ అదుపు చేయకపోతే భారత్‌లో డిజిటల్ వీడియో పరిశ్రమకు ఆదాయ నష్టాలు ప్రస్తుత రూ.10,260 కోట్ల నుంచి 2029 నాటికి రెండింతలై రూ.20,520 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి తర్వాత సబ్‌స్క్రిప్షన్ ఆదాయంలో 150 శాతం పెరుగుదల ఉన్నప్పటికీ.. దేశంలోని 51 శాతం మీడియా వినియోగదారులు పైరేటెడ్ మూలాల నుండి కంటెంట్‌ను వినియోగిస్తున్నారని ‘ఈవై–ఐఏఎంఏఐ’ రిపోర్ట్ వెల్లడించింది.
బీమా కంపెనీలతో చర్చలు..
ఈ నష్టం ఆదాయంపై ప్రభావం చూపడమే కాకుండా డిజిటల్ వీడియో పరిశ్రమ వృద్ధికి ఆటంకం కలిగిస్తోంది. ఉద్యోగ నష్టాలకు దారితీస్తోంది. ‘ఆదాయాలపై పైరసీ ప్రభావం చూపుతూనే ఉంది. సినిమా పంపిణీకి బీమాను ఎంచుకునేటప్పుడు.. పైరసీ నష్టాలు, నిరోధక చర్యలకు కూడా కవరేజ్ ఉండాలి’ అని నిర్మాతలు అంటున్నారు. సినిమా పైరసీ నుంచి రక్షణ పొందడానికి నిర్మాతలు, బీమా కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. పైరసీకి కవరేజ్ అత్యవసరం అన్న డిమాండ్ పెరుగుతోంది. బీమా సంస్థలు మాత్రం పైరసీ నష్టాలకు బీమా కవరేజ్ చేయడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే నష్టాలను లెక్కించడం, నిరూపించడం కష్టం అనేది వాటి వాదన.